Reading Time: < 1 minute

కొంత మంది కొంచం పాపులారిటీ వస్తే చాలు.. తెగ పోజులు కొడతారు. కానీ, కొందరు మాత్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చినా.. చాలా సింపుల్‌గా ఉంటారు. టీం ఇండియా క్రికెటర్ శివమ్ దూబె ఈ రెండో కేటగిరీకి చెందిన వాడే. టి-20 ప్రపంచకప్‌లో అద్భతంగా రాణించి.. భారత్ ప్రపంచకప్ సాధించడంలో దూబె కీలక పాత్ర పోషించాడు. అయినా అతడిలో ఏ మాత్రం అహంకారం లేదు అనడంలో ఈ ఘటనే ఉదాహరణ. ప్రస్తుతం దూబెకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఓ భవంతి బయట దూబె ఫోన్‌లో మాట్లాడుతుండగా.. ఆ సమయంలో ఓ వ్యక్తి అనుమతి లేకుండా అతడిని వీడియో తీస్తున్నాడు. దూబె స్థానంలో ఎవరున్న ఆ సమయంలో కాస్తైనా కోపం తెచ్చుకుంటారు. కానీ దూబె మాత్రం చాలా సున్నితంగా వీడియో డిలీట్ చేయాలని సూచించాడు. అంతకు ముందు ఆ వ్యక్తితో సరదాగానూ సంభాషించాడు.

‘మీరు ఇక్కడికి ఎలా వచ్చారు?’ అని దూబె ఆ వ్యక్తిని అడిగాడు. ఆ వ్యక్తి తాను ఎలా వచ్చింది చెబుతూనే.. టి-20 ప్రపంచకప్ సాధించి దేశానికి మంచి పేరు తెచ్చరని దూబెని ప్రశంసించాడు. దూబె సైతం నవ్వుతూ.. సమాధానమిచ్చాడు. ‘నా భార్య వస్తోంది. ఆవిడను వీడియో తీయండి’ అని అన్నాడు. ఆ తర్వాత వీడియో తీస్తున్న వ్యక్తిని ఆ వీడియో డిలీట్ చేయమని సున్నితంగా చెప్పాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోపం తెచ్చుకోకుండా హాస్య చతురతతో మాట్లాడిన దూబె సంస్కారానికి నెటిజన్లు అవాక్కవుతున్నారు.