
అమరావతి: అహింసా మార్గంలో పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించారని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఆంధ్రులు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారని అన్నారు. 58 రోజుల దీక్షకు గుర్తుగా 58 అడుగుల భారీ విగ్రహమిది. పొట్టి శ్రీరాములు 125 వ జయంతి సందర్భంగా 58 అడుగుల భారీ కాంస్య విగ్రహావిష్కరణ జరిగింది. ఈ ఆవిష్కరణకు చంద్రబాబు, డిప్యూటి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ పాల్గొని.. పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడుతూ..పొట్టి శ్రీరాములు మన జాతిపిత మహాత్మ గాంధీ నాయకత్వంలో పనిచేశారని, అనేక సామాజిక ఉద్యమాల్లో భాగస్వాములయ్యారని తెలియజేశారు. ఆరు నెలల్లో మొదటి దశ పనులు పూర్తయ్యాయని, 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్ వినియోగించారని, పొట్టి శ్రీరాములు త్యాగాన్ని ఈ తరం వాళ్లు తెలుసుకోవాలని చంద్రబాబు సూచించారు.
రాజధాని లేని రాష్ట్రంలో వైసిపి మూడు ముక్కలాట ఆడిందని, అమరావతిని గత పాలకులు శ్మాశానం అని అవహేళన చేశారని విమర్శించారు. అమరావతిని శ్మశానం అని.. ఎడారి అన్నారని.. అమరావతిని గురించి గత ప్రభుత్వంలో ఎన్నో మాటలన్నారని మండిపడ్డారు. ఎపికి పోలవరం జీవనాడి అని.. రాజధాని నిర్మాణానికి 29 వేల మంది రైతులు 33 ఎకరాల భూమిని ఇచ్చారని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారీ ల్యాండ్ పూలింగ్ కు సహకరించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. చరిత్రలో మంచీ, చెడు రెండిటినీ గుర్తు పెట్టుకోవాలని, 21 నెలల కూటమి పాలనలో మంచి ఫలితాలు వస్తున్నాయని, అమరావతి నిర్మాణంలో ఎంతో మంది రైతుల త్యాగం ఉందని పేర్కొన్నారు. అమరావతి తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం అని.. రాజధాని అమరావతి రాష్ట్ర ప్రజలకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.