
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
విమర్శనాస్త్రాలకు పదును పెట్టిన విపక్షాలు
ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమైన మంత్రులు
11.45 గంటలకు కొత్త గవర్నర్ ప్రసంగం
గంటలకు అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
బడ్జెట్ ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సిఎం
డ్రగ్స్ కలకలం, మూసీ నదీ ప్రక్షాళన, గోదావరి నదీ జలాల వివాదం,
గిగ్ వర్కర్స్‌కు కొత్త చట్టం, విద్యా రంగంలో కొత్త విధానాలు,
కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ మౌనం, సోషల్ మీడియా కట్టడికి
తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చించే అవకాశం
ఈసారి కూడా కెసిఆర్ రానట్లేనా..?
మన తెలంగాణ/హైదరాబాద్‌ః
రాష్ట్ర కౌన్సిల్, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉభయ సభల (కౌన్సిల్, అసెంబ్లీ) సభ్యులనుద్దేశించి కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఉదయం 11.45 గంటలకు ప్రసంగించనున్నారు. రెండు రోజుల పాటు గవర్నర్ ప్రసంగానికి ఉభయ సభలూ ధన్యవాదాలు తెలిపిన అనంతరం ఈ నెల 20న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
ఈ సమావేశాలు వాడి-వేడిగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. విపక్షాల నేతలు తమ విమర్శనాస్త్రాలకు పదును పెట్టారు. కాగా వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు మంత్రులు, అధికారపక్ష సభ్యులు సంసిద్ధంగా ఉన్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా డ్రగ్స్ కలకలం సృష్టించే అవకాశం ఉంది. ఇంకా మూసీ నదీ ప్రక్షాళన, మూసీ నదీ ప్రక్షాళన, గోదావరి నదీ జలాల వివాదం, గిగ్ వర్కర్స్‌కు కొత్త చట్టం, విద్యా రంగంలో కొత్త విధానాలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ మౌనం, సోషల్ మీడియా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
గిగ్ వర్కర్ల హక్కుల పరిరక్షణ కోసం కొత్త చట్టానికి మద్దతుపై చర్చించనున్నారు.
విద్యా రంగంలో కొత్త విధానాల అమలు, మార్పులు, బడ్జెట్ కేటాయింపులపై చర్చించే అవకాశం ఉంది. ఇంకా సోషల్ మీడియాలో నకిలీ వార్తల ప్రసారం, హార్మ్ కంటెంట్ నియంత్రణకు తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యల గురించి చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రధానంగా
మూసీ నది ప్రక్షాళనపై చర్చ జరుగుతుంది. అదేవిధంగా నదీ జలాల అంశంపై, కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు, సిబిఐ మౌనం, హైడ్రాతో ప్రజలకు కలిగిన మేలు, తదితర అంశాలపై చర్చించే సూచనలు కనిపిస్తున్నాయి.
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
ఇదిలాఉండగా ఉభయ సభలనుద్ధేశించి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రసంగించడానికి పదిహేను నిమిషాల ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహానికి ఎడమ వైపు బిఆర్‌ఎస్ అంబేద్కర్ విగ్రహం ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు అసెంబ్లీ అధికారులు ఇప్పుడు కొత్తగా గాంధీ విగ్రహానికి కుడి వైపున తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు.
పది రోజుల పాటు సమావేశాలు ?
సోమవారం గవర్నర్ ఉభయ సభలనుద్ధేశించి ప్రసంగించి వెళ్ళిన అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన అసెంబ్లీ వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) సమావేశం కానున్నది. మరోవైపు కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన కౌన్సిల్ వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) సమావేశమై అజెండాపై చర్చించనున్నది. ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలన్న అంశంపై కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. కౌన్సిల్, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సుమారు పది రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.
బడ్జెట్ సమావేశాలకు కెసిఆర్ వస్తారా..?
రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత కెసిఆర్ అసెంబ్లీకి వస్తారా..లేక ఎప్పటిలానే శాసనసభ సమావేశాలకు దూరంగానే ఉంటారా…? అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే కెసిఆర్ సభకు హాజరవడంపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ఈసారి కూడా బడ్జెట్ సమావేశాలకు రాకపోవచ్చని పలువురు పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాలలో భాగంగా సోమవారం ఉభయ సభలను ఉద్దేశిస్తూ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగిస్తారు. తర్వాత రెండు రోజులు మంగళ, బుధవారాలు రెండు సభల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదం తెలుపుతారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈసారి బడ్జెట్ చర్చలతో పాటు మూసీ ప్రాజెక్టు, సింగరేణి బొగ్గు కుంభకోణం, ఇతర అంశాలపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది.