
నెతన్యాహు చిన్నారుల హంతకుడు
ఇప్పటికీ ఆయన ఉనికిపై అనుమానాలు ఉన్నాయి
ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ హెచ్చరిక
టెహ్రాన్ : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బయటి ప్రపంచానికి కొద్ది రోజులుగా కనిపించకపోవడంతో ఆయన ఉనికిపై రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తుతుతన్నాయి.ఈ నేపథ్యంలో ఆదివారం ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ ఘాటు హెచ్చరిక చేసింది. నెతన్యాహు బతికి ఉన్నట్టయితే ఆయనను వెంటాడి మరీ అంతమొందిస్తామని హెచ్చరించింది. చిన్నారులను పొట్టనపెట్టుకున్న హంతకుడిగా నెతన్యాహును అభివర్ణించింది. ఆయన ఇప్పటికీ బతికే ఉన్నారా అనేది మాత్రం అనుమానమేనని ఇరాన్ అభిప్రాయపడింది. నెతన్యాహు మరణించి ఉంటాడని?.. లేకపోతే కుటుంబంతో పాటు దేశాన్ని వీడి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇటీవల నెతన్యాహు పత్రికా సమావేశానికి సంబంధించిన వీడియో విడుదల కావడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. వీడియోలో నెతన్యాహు చేతికి ఏకంగా ఆరు వేళ్లు ఉండటం గమనించిన కొందరు అది ఏఐతో చేసిన వీడియో అని కామెంట్ చేశారు. ఈ క్రమంలో అమెరికా రాజకీయాల విశ్లేషకురాలు కాండిస్ ఓవెన్స్ కూడా నెతన్యాహు ఎక్కడ? అని ప్రశ్నించడం మరింత కలకలం రేపింది.