Reading Time: < 1 minute

‘ఖర్గ్’పై సరదాగా మరిన్ని దాడులు చేస్తాం

చమురు క్షేత్రాలను లక్షంగా చేసుకోలేదు

సైనిక స్థావరాలను దారుణంగా దెబ్బతీశాం

మొజ్తాబా బతికి ఉన్నాడనేది అనుమానమే

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు

న్యూయార్క్ : పశ్చిమాసియాలో తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారంనాడు ఓ వార్త సంస్థకకు ఇచ్చిన ఇంటర్వూలో ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టుగా ఉన్న ఖర్గ్ ద్వీపంపై సరదాగా మరిన్ని దాడులు చేస్తామని అన్నారు. ఇప్పటికే మేం జరిపిన దాడుల్లో భారీగా దెబ్బతిందని, అధిక భాగం ధ్వంసమైందన్నారు. అత్యధికంగా సైనిక స్థావరాలనే లక్షంగా ఎంచుకున్నామని ట్రంప్ తెలిపారు. చమురు క్షేత్రాలను దాడులకు లక్షంగా చేసుకోలేదని స్పష్టం చేశారు. యుద్ధం ముగింపు దిశగా ఒప్పందానికి ఇరాన్ సంసిద్ధంగా ఉందని, అందుకు ప్రతిపాదిస్తున్న షరతులు మాత్రం అంగీకార యోగ్యంగా లేవన్నారు. యుద్దం ముగింపునకు తాము సిద్ధంగా లేమంటూనే ఇరాన్ విధిస్తున్న షరతులేంటో చెప్పేందుకు ట్రంప్ నిరాకరించారు. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ బతికే ఉన్నాడనడానికి రుజువులేంటని ట్రంప్ ప్రశ్నించారు. ఆయన బతికి ఉన్నట్లు లేడని తాను విన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇప్పటి వరకు బహిరంగంగా కనిపించలేదు కదా అని ప్రశ్నించారు. ఒక వేళ బతికి ఉంటే ఆ దేశం కోసం.. లొంగిపోయేందుకుతెలివైన నిర్ణయం తీసుకుని ఉండేవారన్నారు.