Reading Time: < 1 minute

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కించుకున్న పాలంపేటలోని కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) ఆలయ పరిసరాల్లోని సా.శ.13వ శతాబ్దికి చెందిన వర్ధమాన మహావీరుని జైన గుడిని పదిలపరిచి, పరిరక్షించాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సిఇఒ, డా. ఈమని శివనాగిరెడ్డి, టార్చ్ సంస్థ కార్యదర్శి, అరవింద్ ఆర్య కోరారు. రామప్ప ఆలయ సమీపంలోని రెండు సమకాలీన ఆలయాలను రక్షిత కట్టడాల జాబితాలో చేర్చిన కేంద్ర పురావస్తు శాఖ అధికారులను వారు అభినందిస్తూ, జైనగుడిని కూడా ఆ జాబి తాలో చేర్చాలని కోరారు. ఆదివారం రామప్ప పరిసరాల్లోని కాకతీయ ఆనవాళ్లను పరిశీలించిన వారిద్దరు, జైనాలయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.

గర్భాలయం, అర్దమండపం, రెండిటికి ద్వారాలు, వాటిపైన జైన చిహ్నమైన పూర్ణ కలశం, గర్భాలయంపై నాగర శైలి విమాన (శిఖరం), దానికి అనుసంధానంగా సుకనాసి, కాకతీయ ఆలయ వాస్తుకు అద్దం పడుతున్నాయన్నారు. గర్భాలయం లోపల పీఠంపై గల సింహం శిల్పం చివరి జైన తీర్థంకుడైన వర్ధమాన మహావీరుని లాంఛనమని, అందువల్ల ఈ ఆలయం వర్ధమాన మహావీరునికి అంకితం చేయబడిందని చెప్పొచ్చని శివనాగిరెడ్డి, అరవింద్ ఆర్య చెప్పారు. అద్భుత కాకతీయ వాస్తు నైపుణ్యం ఉట్టిపడుతున్న ఈ ఆలయాన్ని కూడా పదిలపరిస్తే రామప్ప ఆలయ సందర్శకులకు మరో పర్యాటక ఆకర్షణ అవుతుందని వారన్నారు.