
ప్రస్తుతం కిలో రూ.320..రానున్న రోజుల్లో రూ.380కి చేరే ఛాన్స్?
మన తెలంగాణ/హైదరాబాద్ : అన్‌సీజన్‌లోనూ చికెన్ ధరలు చుక్కలనంటుతున్నాయి. ట్రిపుల్ సెంచరీ దాటడంతో సామాన్యులకు చికెన్ కూర దూరమవుతోంది. వివరాల్లోకి వెళితే.. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. సాధారణంగా డిమాండ్ తక్కువగా ఉండే అన్ సీజన్‌లోనే చికెన్ ధరలు ఒక్కసారిగా పెరగడం వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో చికెన్ ధరలు ట్రిపుల్ సెంచరీ దాటేసి కిలోకు రూ.320 వరకు అమ్ముడవుతున్నాయి. స్థానిక మార్కెట్లలో చికెన్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటం తో.. సామాన్య జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చికెన్ ధర ఎంత అని అడిగి మరీ కొనకుండా వెళ్లిపోతున్నారని వ్యాపారాలు అంటున్నా రు.
ఇదే ధరకు హాఫ్ కేజీ మటన్ వస్తది కదా అంటూ కొనకుండా కొనుగోలు దారులు వెనుదిరుగుతున్నారు. ప్రస్తుతం షాప్స్ అన్ని ఖాళీగా దర్శన మిస్తు న్నాయి. గతంలో ఇదే సమయంలో చికెన్ ధరలు తక్కువగా ఉండేవి. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉందని వ్యాపారులు చెబుతున్నా రు. పౌల్ట్రీ ఫారాల నుంచి సరఫరా తగ్గిపోవడమే ధరలు పెరగడానికి ప్రధాన కారణమని వారు వాపోతున్నారు. పౌల్ట్రీ పరిశ్రమలో ఉత్పత్తి తగ్గడం, రవాణా ఖర్చులు పెరగడం, కోళ్ల సంఖ్య తగ్గిపోవడం వంటి కారణాలతో మార్కెట్‌లో చికెన్‌కు కొరత ఏర్పడిందని వ్యాపారుల మాటగా వినవస్తోం ది. ఈ కారణాల వల్లే ధరలు ఒక్కసారిగా పెరిగాయని అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఏడాది చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశ ముందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. వచ్చే కొన్ని నెలల్లోనే కిలో చికెన్ ధర రూ.380 వరకు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. భవిష్యత్తులో చికెన్ ధరలు మరింత భారంగా మారే అవకాశముందని సామాన్యులు ఆందోళన వ్యక్తపరుస్తు న్నారు.