Reading Time: 2 minutes

క్రీడలను యువత అభివృద్ధి కోసం వినియోగించాలి

సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డా. కె. నారాయణ

మన తెలంగాణ / హైదరాబాద్ : డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడిన టిడిపి ఎంపి పుట్ట మహేష్, మాజి ఎంఎల్‌ఎ రోహిత్ రెడ్డి పై కఠిన చర్యలు, తీసుకోవాలని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డా.కె. నారాయణ డిమాండ్ చేశారు. క్రీడలను కార్పొరేట్ లాభాల కోసం కాకుండా యువత అభివృద్ధి కోసం వినియోగించాలని ఆయన కోరారు. ఐపిఎల్ పేరుతో క్రీడాకారులను సంతలో సరుకుల్లా కొనుగోలు చేసే క్రీడా వ్యాపారాన్ని అరికట్టాలని నారాయణ కోరారు. ఎఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ సీ గ్రౌండ్స్ లో ఈ నెల 12నుండి 17వరకు నిర్వహిస్తున్న భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్(బిపిఎల్) టోర్నీ నాల్గవ రోజు నారాయణ, ఉస్మానియా యూనివర్సిటీ ఉప కులపతి మొలుగురం కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సంధర్భంగా నారాయణ మాట్లాడుతూ దేశంలో క్రీడల అభివృద్ధి విషయంలో పాలక వర్గాలు అవలంబిస్తున్న విధానాలను తప్పుపట్టారు. దేశ యువతలో అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు క్రీడలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో మైదానాలు, శిక్షణా కేంద్రాలు, క్రీడా సదుపాయాలు కల్పించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. క్రీడలను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వాలు వాటిని కార్పొరేట్ లాభాల కోసం ఉపయోగించే విధంగా మారుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భగత్ సింగ్ వంటి విప్లవ వీరుల ఆశయాలు యువతకు ప్రేరణ కావాలని నారాయణ పేర్కొన్నారు. యువత క్రీడలు, విద్య, సామాజిక బాధ్యతల వైపు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. క్రీడలను కూడా వ్యాపారంగా మార్చి బెట్టింగ్ యాప్స్, మాదకద్రవ్యాల సంస్కృతి యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని హెచ్చరించారు. క్రీడలు క్రమశిక్షణ, ఐక్యత, పోరాటస్ఫూర్తి పెంపొందించే గొప్ప సాధనమని అన్నారు. భగత్ సింగ్ క్రికెట్ టోర్నమెంట్ యువతలో చైతన్యం కలిగించే మంచి కార్యక్రమమని అభినందించారు.

ఉస్మానియా యూనివర్సిటీ ఉప కులపతి మొలుగురం కుమార్ మాట్లాడుతూ డ్రగ్స్, మాదకద్రవ్యాల వ్యసనం యువత భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదకరమైన సమస్యగా మారిందని, విద్యార్థులు, యువత అలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్యలో ముందుండాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులు, యువత ముందుండాలని, ఈ దిశగా యువతలో చైతన్యం కలిగించడానికి రెఐవైఎఫ్ నిర్వహిస్తున్న ఈ క్రికెట్ టోర్నమెంట్ అభినందనీయమని ఉప కులపతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సికింద్రాబాద్ నియోజకవర్గ కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్, ఎఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, రాష్ట్ర ఉపాధ్యక్షులు టి. సత్య ప్రసాద్, శ్రీమాన్, ఎఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి నేర్లకంటి శ్రీకాంత్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహమూద్, జిల్లా ఉపాధ్యక్షుడు కళ్యాణ్, రాజ్ కుమార్, మహేష్, భాను, సక్రి భాయి, హరీష్ లతో పాటు 5 టీమ్ ల క్రీడాకారులు పాల్గొన్నారు.