
ఎప్పటిలానే దూరంగానే ఉంటారా…?
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత కెసిఆర్ అసెంబ్లీకి వస్తారా..లేక ఎప్పటిలానే శాసనసభ సమావేశాలకు దూరంగానే ఉంటారా…? అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే కెసిఆర్ సభకు హాజరవడంపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ఈసారి కూడా బడ్జెట్ సమావేశాలకు రాకపోవచ్చని పలువురు పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాలలో భాగంగా సోమవారం ఉభయ సభలను ఉద్దేశిస్తూ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగిస్తారు. తర్వాత రెండు రోజులు మంగళ, బుధవారాలు రెండు సభల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదం తెలుపుతారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈసారి బడ్జెట్ చర్చలతో పాటు మూసీ ప్రాజెక్టు, సింగరేణి బొగ్గు కుంభకోణం, ఇతర అంశాలపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది.