Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: దేశంలో నాలుగు రాష్ట్రాలతో పాటు ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. తమిళనాడు (234), పశ్చిమ బెంగాల్ (294), కేరళ (140), అస్సాం (126)తో పాటు పుదుచ్చేరి (30) రాష్ట్రాల్లో మొత్తంగా 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ వివరాలను వెల్లడించింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది.

అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్ ఏప్రిల్ 9న, తమిళనాడులో ఏప్రిల్ 23న పశ్చిమ బెంగాల్‌లో మాత్రం రెండు దశల్లో అంటే ఏప్రిల్ 23, ఏప్రిల్ 29న పోలింగ్ జరుగనుంది. కాగా మే 4న కౌంటింగ్ జరుగనుంది.

పుదుచ్చేరితో పాటు నాలుగు రాష్ట్రాల శాసనసభల పదవీకాలం మే, జూన్‌లలో వేర్వేరు తేదీల్లో ముగియనుంది. ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను పూర్తి చేసిన ఎన్నికల సంఘం.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించేందుకు ఆయా రాష్ట్రాల్లో ఇటీవల పర్యటించింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్, కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీలు షెడ్యూల్ ప్రకటించారు.