
హైదరాబాద్: టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కోరినట్లు డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు డ్రగ్స్ వాడటం దురదృష్టకరం మని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా డ్రగ్స్ వాడకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తానన్నారు. డ్రగ్స్ వాడకం, చట్ట విరుద్ధ కార్యకలాపాలను బిఆర్ఎస్ ఖండిస్తుందని చెప్పారు. డ్రగ్స్ వినియోగించేది ఎంతటి వారైనా శిక్షించాలని డిమాండ్ చేశారు.
‘‘రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు డ్రగ్స్ టెస్టుకు సిద్ధంగా ఉండాలి. నేను ఏ పరీక్షకైనా సిద్ధమని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశా. ప్రజాప్రతినిధులు డ్రగ్స్ టెస్ట్ చేయించుకొని అందరికీ ఆదర్శంగా ఉండాలి. డ్రగ్స్ కేసులో నన్ను లాగితే చట్టపరంగా నోటీసులిస్తా’’ అని కెటిఆర్ అన్నారు.