Reading Time: < 1 minute

హైదరాబాద్: దేవుళ్లపై ప్రమాణాలు చేసి హామీలను ఎగ్గొట్టిన మొదటి సిఎం రేవంత్ రెడ్డి అని బిఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. మూడు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టారని, రైతులు రైతుభరోసాపై ఆశలు వదులుకున్నారని అన్నారు.  రేవంత్ రెడ్డికి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ రాసి.. అంశాలను వెల్లడించారు. వనపర్తిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారులు ప్రజల పక్షాన నిలబడాలి..రాజకీయ నాయకుల కొమ్ము కాయొద్దు అని..ప్రశ్నించే వారిని అధికారులు అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని తెలియజేశారు. సకాలంలో కరెంట్, యూరియా అందక పంటలు ఎండిపోతున్నాయని, ప్రభుత్వం అసమర్థత కారణంగానే ఈ దుస్థితి దాపురించిందని విమర్శించారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, రామన్న గట్టు రిజార్వాయర్ శంకుస్థాపన చేసినా ఇంతవరకూ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇరిగేషన్ చీఫ్ అందుబాటులో లేక సాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, జిల్లా మంత్రులకు కక్షసాధింపు చర్యలు తప్ప.. ప్రజా సంక్షేమం పట్టదు అని ధ్వజమెత్తారు. 7 టిఎంసిల సామర్థ్యం ఉన్న ఎదుల రిజర్వాయర్ ను రెండేళ్లలోనే పూర్తి చేశామని అన్నారు. 2 టిఎంసిల రామన్న గట్టు రిజర్వాయర్ ను పూర్తి చేయలేకపోతున్న కాంగ్రెస్ అని నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు.