
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. బారాముల్లా జిల్లా ఉరి సెక్టార్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఓ పాకిస్థాన్ ఉగ్రవాదిని భద్రతదళాలు మట్టుబెట్టాయి. శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఆపరేషన్‌లో భారత ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు ఉగ్రకుట్రను భగ్నం చేశారు. ఉరి సెక్టార్‌లోని బుచ్చార్ ప్రాంతం నుంచి ఉగ్రవాదులు సరిహద్దు దాటేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోని దిగిన సైన్యం మార్చి 14-15 మధ్య రాత్రి సమయంలో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో పొదల్లో నక్కిన ఉగ్రవాదుల కదలికలను గమనించి వారిని హెచ్చరించారు. కానీ, ఉగ్రవాదులు జవాన్లపై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో జవాన్లు కూడా ఎధురుకాల్పులు జరపగా.. ఒక పాక్ ఉగ్రవాది హతమయ్యాడు. ఘటనాస్థలం నుంచి ఒక ఎకె-47 రైఫిల్, పిస్టల్స్, భారీగా మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎవరైనా నక్కి ఉన్నారనే అనుమానంతో గాలింపు చర్యలు చేపట్టారు.