Reading Time: < 1 minute

రొమాంటిక్, కామెడీ, కమర్షియల్ కథలతో ఇప్పటికే మంచి గుర్తింపు పొందిన యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ఈసారి కొత్త తరహా కథలతో సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యాడని తెలిసింది. విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఆయన భావిస్తున్నాడట. సిద్ధు వరుసగా ఇప్పుడు ఆసక్తికరమైన ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం మూడు కొత్త ప్రాజెక్టులకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అందులో ఒకటి సోషియో ఫాంటసీ స్టోరీతో రూపొందబోతున్న చిత్రమని సమాచారం. కొత్త దర్శకుడు ఆ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ మూవీ చాలా కొత్తగా ఉండబోతుందట. మరో ప్రాజెక్టును స్వరూప్ దర్శకత్వంలో సిద్ధు చేయబోతున్నట్లు తెలుస్తోంది. స్వరూప్ డైరెక్షన్ లో ఇప్పటికే వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ మంచి ప్రశంసలు అందుకుంది.

స్పెషల్ స్టోరీ, కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆయన గుర్తింపు పొందగా.. ఇప్పుడు అదే దర్శకుడితో సిద్ధు జొన్నలగడ్డ కలిసి పని చేయబోతున్నట్లు వార్తలు రావడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. విభిన్నమైన కథాంశంతో సినిమా ఉండబోతుందని, ప్రస్తుతం స్క్రిప్ట్ పై చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అంతేకాకుండా మరో మూవీని టాలీవుడ్ లో అత్యంత విజయవంతమైన దర్శకుల్లో ఒకరితో చేయబోతున్నాడట. కమర్షియల్‌గా బలమైన కథతో ఆ సినిమా స్పెషల్ గా ఉండబోతుందని, సిద్ధు కెరీర్ లో ఇది ఒక కీలక ప్రాజెక్ట్ అవుతుందని తెలిసింది. ప్రస్తుతం సిద్ధు.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఒక సినిమాలో నటిస్తుండగా.. ఆ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్నట్లు సమాచారం. ఆ చిత్రం పూర్తయిన తర్వాత ఆయన కొత్తగా ఓకే చెప్పిన మూడు ప్రాజెక్టుల్లో ఏదో ఒకటి ప్రారంభమయ్యే అవకాశముంది. అయితే కొత్త కథలు, కొత్త దర్శకులు, ప్రముఖ డైరెక్టర్స్ తో కలిసి పని చేస్తూ ప్రేక్షకులను మెప్పించేలా ఆయన పెద్ద ప్లానే వేస్తున్నారని చెప్పాలి.