Reading Time: < 1 minute

చొరబాటుదార్లకు కొమ్ముకాయడం, రాజకీయ లబ్థికి దిగడం తృణమూల్ కాంగ్రెస్ నిజరూపం అని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. అక్రమ వలసదార్లు ఓటుబ్యాంక్‌లు కావడంతోనే ఇప్పుడు టిఎంసి ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ సర్‌ను అడ్డుకునేందుకు యత్నిస్తోందని ప్రధాని చెప్పారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో శనివారం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. టిఎంసి హయాంలో సరిహద్దులు దాటి వచ్చిన వారి సంఖ్య ఎక్కువ అయింది. దీనితో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో జనాభాపరంగా చాలా అసమతూకత ఏర్పడింది. కొన్ని ప్రాంతాలలో అక్రమ వలసదార్లు ఎక్కువగా ఉన్నారని, ఇది టిఎంసి వారి అక్రమ ఇమిగ్రేషన్ పద్థతితో జరిగిందని విమర్శించారు. ఇక్కడి ప్రభుత్వం రాజ్యాంగ పద్ధతులను పట్టించుకోదు. చొరబాట్లను తమ అధికారపు పలుకుబడితో ప్రోత్సహిస్తుంది.

ఇక ఇటువంటి ఈ మమత బెనర్జీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ఆరంభం అయిందని తెలిపారు. సర్ అంటే టిఎంసికి హడల్ పుట్టుకుంది.ఎందుకంటే తమకు ఓటు బ్యాంక్‌లైన చొరబాటుదార్లు ఓటర్ల జాబితాల్లో నుంచి ఎగిరిపోతారు. తమ బలం లేకుండా పోతుంది. దీనిని జరగకుండా చేసేందుకు సర్‌పై కారాలు మిరియాలకు దిగుతున్నారని ప్రధాని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సర్ ప్రక్రియతో ఇప్పటికే 64 లక్షల మంది ఓటర్ల పేర్లు అక్రమదార్ల కారణంగా తొలిగించారు. దీనితో ఇప్పుడు ఇంతకు ముందు 7.66 కోట్ల మంది ఓటర్లు ఉన్న రాష్ట్ర ఓటర్ల సంఖ్య ఇప్పుడు 7.04 కోట్లకు చేరిందని తెలిపారు. రాష్ట్రంలో హిందువులను కావాలనే మైనార్టీలుగా మలిచేందుకు టిఎంసి పావులు కదిపిందని, అయితే ఈ ఆటలు సాగబోవని హెచ్చరించారు.