
తన ఇద్దరు పిల్లలను గొంతు నులిమిన తల్లి.. తర్వాత తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన హైదరాబాద్ లోని బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం.. సత్యవాణి, మురళి వేణు దంపతులు తమ కుటుంబంతో కలిసి పెద్దమ్మనగర్ లో నివాసముంటున్నారు. వీరికి కుమారుడు(5), కూతురు(2) ఉన్నారు. మురళి తన తండ్రిని డయాలసిస్ చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లిన అనంతరం సత్యవతి తన ఇద్దరు పిల్లల గొంతు నులిమి తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
అయితే, ఈ ఘటనలో తల్లితోపాటు కుమారుడు చనిపోగా.. కూతురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. చావుబతుకుల్లో ఉన్న చిన్నారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై ఆరా తీయగా.. కుటుంబ కలహాల కారణంగానే సత్యవతి ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.