Reading Time: < 1 minute

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ యాత్రపై తేనటీగలు దాడి చేశాయి. శనివారం ఉదయం కరీంనగర్ నుండి కొండగట్టుకు బండి సంజయ్.. సంజయ్‌ అంజన్న ఆశీర్వాద యాత్ర చేపట్టారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రం నుంచి భారీగా బిజెపి శ్రేణులతో కలిసి సంజయ్ యాత్రను ప్రారంభించారు. అయితే, రామడుగు మండలంలోని వెదిరకు చేరుకున్న సంజయ్ పాదయాత్రపై తేనటీగల గుంపు దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే వారిని చికిత్స కోసం దగ్గరలోని ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొండగట్టుకు బండి సంజయ్ యాత్ర కొనసాగుతోంది.

కాగా, అంతకుముందు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కరీంనగర్ మేయర్ పీఠం బిజెపికి కైవసమైతే కొండగట్టు అంజన్న ఆలయానికి కాలినడకన వచ్చి మొక్కులు తీర్చుకుంటానని మొక్కుకున్నట్లు తెలిపారు. అందుకే తాను యాత్ర చేపట్టినట్లు తెలిపారు. అంజన్న క్షేత్రాభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉందని, డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం అని ఆయన చెప్పారు.