
హైదరాబాద్: రైతులకు పెట్టుబడి, ఎరువులు అన్నీ ఇస్తున్నాం అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తన తోటలో అనేక పంటలు పండిస్తున్నానని అన్నారు. రూ.300 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఫ్యాక్టరీని మంత్రులు పరిశీలించారు. సిద్ధిపేటలో నర్మెట్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ సందర్శించారు. ఈ నెల 22న సిఎం రేవంత్ రెడ్డి ఫ్యాక్టరీ ప్రారంభించనున్నారు. ప్రోసెసింగ్ పరిశీలన ట్రయల్ రన్ లో భాగంగా నడుస్తుందని, ప్రోసెసింగ్ యూనిట్ గంటకు 30 టన్నుల సామర్థ్యంతో పనిచేయనుందని అన్నారు.
ఈ సందర్భంగా సిద్ధిపేట జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆయిల్ పామ్ టన్ను ధర రూ. 20 వేలకు పైగా పెంచామని చెప్పారు. రైతులు ధైర్యంగా ఆయిల్ పామ్ పంట వేయండి అని.. ఆయిల్ పామ్ తో పాటు ఇతర పంటలను మధ్యలోవేసుకోవచ్చునని తుమ్మల సూచించారు. ఆయిల్ పామ్ పంటకు నీటి సమస్య, మార్కెట్ సమస్య లేదని, అన్ని విధాల రైతులకు లాభాలు ఇచ్చే పంట అని తెలియజేశారు. గ్యారెంటీగా ఆదాయాన్ని ఇచ్చే ఆయిల్ పామ్ అని.. నర్మెట్టలో రైతు మేలా నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ కు అనువైన 20 లక్షల ఎకరాల భూమి ఉందని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.