
మోత్కూర్: ఇంట్లో తండ్రి చనిపోయి ఉన్నాడు.. దు:ఖాన్ని దిగమింగుకొని కుమారుడు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో జరిగింది. మోత్కూరు చెందిన కూరెళ్ల ఎల్లయ్య అనే వ్యక్తి గుండాల మండలం వస్తాకొండూరులో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో ఎల్లయ్యకు గుండెపోటు రావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని వైద్యులు సూచించారు. హైదరాబాద్ కు వెళ్తుండగా మార్గం మధ్యలో అతడు మృతి చెందాడు. మృతుడి కుమారుడు హర్షవర్థన్ దు:ఖాన్ని దిగమింగుకొని పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. ఎల్లయ్య కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మోత్కూరులో విషాదచాయలు అలుముకున్నాయి.