Reading Time: < 1 minute

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యాయి. తల్లిదండ్రులు తమ పిల్లలతో పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు.  తెలుగు పరీక్ష ఉదయం 9.30 నుంచి  మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనుంది. పదవ తరగతి పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 5,17,727 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, వారిలో 2,60,916 బాలురు, 2,56,811 బాలికలు ఉన్నారు. పరీక్ష ప్రారంభ సమయానికి మరో 5 నిమిషాలు అదనంగా అంటే ఉదయం 9.35 గంటల వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే విద్యార్థులు చివరి నిమిషంలో ఇబ్బంది పడకుండా ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో విద్యార్థులు ఉదయం 8.30 గంటల వరకు పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్(బిఎన్‌ఎస్‌ఎస్ 163) అమలులో ఉంటుంది. పది పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 144 ఫ్లైయింగ్ స్కాడ్‌లను నియమించారు.