Reading Time: < 1 minute

కోల్‌కతా: త్వరలో ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2026 కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానిని జట్టులోకి తీసుకొంది. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తఫిజుర్ స్థానంలో మరో స్పీడ్‌స్టర్ ముజరబానికి టీమ్‌లో చోటు కల్పించింది. ఇటీవల ముగిసిన టి20 ప్రపంచకప్‌లో ముజరబాని అసాధారణ బౌలింగ్‌తో అదరగొట్టాడు. ఆరు మ్యాచుల్లోనే 13 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. దీంతో అతన్ని జట్టులోకి తీసుకనేందుకు కోల్‌కతా ఆసక్తి చూపించింది. ఆ జట్టు క్రికెట్ బోర్డుతో మాట్లాడి ముజరబానిని జట్టులో చోటు కల్పించింది.

కొంత కాలంగా ముజరబాని అద్భుత బౌలింగ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో పెను ప్రకంపనలు సృష్టించింది. తన మార్క్ బౌలింగ్‌తో చెలరేగుతూ వికెట్ల పంట పండిస్తున్నాడు. మూడు ఫార్మాట్‌లలోనూ జింబాబ్వేకు కీలక బౌలర్‌గా మారాడు. స్వల్ప వ్యవధిలోనే 90కి పైగా అంతర్జాతీయ వికెట్లను పడగొట్టి ఔరా అనిపించాడు. తాజాగా ఐపిఎల్‌లోనూ చోటు దక్కించుకున్నాడు. ముస్తఫిజుర్ స్థానంలో కోల్‌కతా అతన్ని తీసుకుంది. త్వరలోనే ముజరబాని కోల్‌కతా జట్టులోచేరనున్నాడు. ఈ విషయాన్ని నైట్‌రైడర్స్ యాజమాన్యం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.