
‘ది ప్యారడైజ్’ చిత్రంలోని ఆయా షేర్ పాట కోసం 2.5 ఎకరాల భారీ సెట్స్‌లో వందల ఇళ్లు,100 ట్యాంకర్లతో మురికివాడ సామ్రాజ్యాన్ని నిర్మించారు ‘ది ప్యారడైజ్’ మేకర్స్. అత్యంత ఆకట్టుకునే సెటప్‌లలో ఒకటి హీరో ఇల్లు (కమాన్ సెట్). ఈ నిర్మాణం వెడల్పు 60 అడుగులు, ఎత్తు 45 అడుగులు, లోతు 25 అడుగులతో నిర్మించబడింది. మొదట ఈ సెట్‌ను 30 అడుగుల వెడల్పుతో నిర్మించగా, తర్వాత ఇరువైపులా 15 అడుగుల చొప్పున విస్తరించి మొత్తం వెడల్పును 60 అడుగులకు పెంచారు. దాదాపు 25 మంది కార్మికులు సుమారు 20 రోజుల పాటు శ్రమించి ఈ భారీ నిర్మాణాన్ని పూర్తి చేశారు. సెట్ చుట్టుపక్కల వాతావరణంలో సహజంగా కలిసిపోయేలా ప్రత్యేక ఏజింగ్ టెక్నిక్స్ ఉపయోగించి దాన్ని మరింత సహజంగా కనిపించేలా తీర్చిదిద్దారు.
ఇక వాటర్ బాడీ విలేజ్ సెట్ మరో హైలెట్. ఇది 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడింది. ఇందులో డమ్మీ నిర్మాణాలు కాకుండా పూర్తిగా నిర్మించిన 60 ఇళ్లు ఉన్నాయి. దాదాపు 50 మంది కార్మికులు 30 రోజుల పాటు శ్రమించి ఈ గ్రామాన్ని నిర్మించారు. ఒకేసారి సుమారు 500 మంది ఉండేలా ఈ గ్రామాన్ని డిజైన్ చేశారు. వాటర్ బాడీ కోసం 100 ట్యాంకర్ల నీటిని తీసుకువచ్చి ఏడు రోజుల పాటు నింపారు. అదనంగా నీటిని నిల్వ ఉంచేందుకు 20 అడుగులు ప్లస్ 20 అడుగుల పరిమాణంతో, 20 అడుగుల లోతు ఉన్న ఒక చెరువును కూడా నిర్మించారు. నిర్మాణంలో భాగంగా మరో భారీ డంప్ యార్డ్ సెట్ కూడా నిర్మించారు. ఇది 120 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తుతో రూపొందించబడింది. దాదాపు 25 మంది సభ్యులతో కూడిన బృందం 30 రోజుల పాటు శ్రమించి ఈ సెట్‌ను నిర్మించింది. నిజమైన డంప్ యార్డ్ వాతావరణాన్ని ప్రతిబింబించేలా సహజమైన, నివసిస్తున్నట్లు అనిపించే లుక్ వచ్చేలా దీనిని డిజైన్ చేశారు.