
ప్రపంచ స్థాయి సాంకేతికతతో కూడిన ప్రీమియం లార్జ్ స్క్రీన్ ఫార్మాట్‌ను ‘అల్లు సినిమాస్’ హైదరాబాద్‌కు పరిచయం చేస్తోంది. హైదరాబాద్‌కు ఇదొక చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుంది. నగరంలో తొలి డాల్బీ సినిమా వచ్చింది. హైదరాబాద్‌లోని కోకాపేటలోని 7 ఎకరాల అల్లు స్టూడియోస్ కాంప్లెక్స్‌లో ఉన్న నాలుగు స్క్రీన్‌ల అల్ట్రా-లగ్జరీ మల్టీప్లెక్స్ అల్లు సినిమాస్‌ను ప్రారంభించినట్లు అల్లు ఎంటర్‌టైన్‌మెంట్ గర్వంగా ప్రకటించింది. హైదరాబాద్‌లో మొట్టమొదటి డాల్బీ సినిమా, ప్రపంచంలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్‌లలో ఒకటిగా ‘అల్లు సినిమాస్’ రికార్డ్ సృష్టించింది.
‘అల్లు సినిమాస్’ ఇచ్చే అనుభూతి గురించి అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. “రెండేళ్లు కష్టపడి ‘అల్లు సినిమాస్’ను నిర్మించాం. ‘అల్లు సినిమాస్’ను నిర్మించడానికి మూడు కారణాలున్నాయి. యూవీ వంశీ సూళ్లూరుపేటలో లగ్జరీ థియేటర్‌ను కట్టారు. ఆ థియేటర్లో సినిమాని చూడటానికి పక్క ఊర్ల నుంచి కూడా జనాలు వస్తున్నారు. అది చూసి నాకు కూడా ఓ లగ్జరీ థియేటర్ కట్టాలని అనిపించింది. మిషన్ ఇంపాజిబుల్ 6 కోసం ఓ పెద్ద పారిశ్రామికవేత్త ఐమ్యాక్స్ లార్జ్ స్క్రీన్‌లో టికెట్లు కావాలని, పిల్లలు గోల చేస్తున్నారని, కచ్చితంగా టికెట్లు కావాలని అడిగారు. ఆ టికెట్లు నేను ఆయనకు ఇవ్వడంతో చాలా సంతోషించారు. అంటే పిల్లలు కేవలం సినిమాని చూడకుండా, దాన్ని అనుభూతి పొందాలని అనుకుంటున్నారు. అప్పుడు నాకు కొన్ని ఐడియాలు వచ్చాయి. లార్జ్ ఫార్మాట్, కొత్త అనుభూతి కోసం ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. అలా మా ‘అల్లు సినిమాస్’ మొదలైంది. సింగిల్ స్క్రీన్లలో వస్తున్న అనుభూతి ఇప్పుడు జనాలకు సరిపోవడం లేదు. అందుకే ఎక్కువగా మల్టీ ప్లెక్స్‌లకు వస్తున్నారు. సినిమా కంటే.. సినిమాని అనుభూతి పొందాలని జనాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మల్టీప్లెక్సుల కంటే ఎక్కువ అనుభూతినివ్వాలని ‘అల్లు సినిమాస్’ను నిర్మించాం. డాల్బీలో సినిమా చాలా కొత్తగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. డాల్బీలోకి మారిన సినిమా విజువల్ పరంగా, సౌండ్ పరంగా అద్భుతంగా ఉంటుంది. 2024లో మేం డాల్బీని సంప్రాదించాం. డాల్బీ సినిమాస్ ఇండియా ప్రతినిథి రాజ్ మాకు ఎంతో సహకరించారు. ఈ స్క్రీన్‌లో 78 స్పీకర్లు, 165 సౌండ్ ఔట్ లెట్లను బయటకు కనిపించకుండా అమర్చారు. జర్మనీ టీం వారు ఈ స్క్రీన్‌ను చూసి ఆశ్చర్యపోయారు. 648 మంది కూర్చునే సామర్థ్యం కలిగిన ఈ ఫ్లాగ్‌షిప్ డాల్బీ సినిమా ఆడిటోరియం ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్ సైజులలో ఒకటి. 75 అడుగుల వెడల్పు ఫ్లాట్ యాస్పెక్ట్ రేషియోలో, భారతదేశంలో అతిపెద్ద డాల్బీ సినిమాగా నిలిచింది. ఫ్లాగ్‌షిప్ డాల్బీ సినిమా కాకుండా మిగిలిన మూడు ఆడిటోరియంలలో బార్కో 4కె లేజర్ ప్రొజెక్షన్, డాల్బీ అట్మోస్ సరౌండ్ సౌండ్ ఉన్నాయి. డాల్బీ-బ్రాండెడ్ ప్రీమియం స్పీకర్లు, స్టేడియం సీటింగ్ ఉన్నాయి. నాలుగు స్క్రీన్‌లలో రిక్లైనర్లు, లాంజర్‌లు అమర్చబడి ఉన్నాయి. చివరి వరుస రిక్లైనర్‌లతో స్క్రీన్‌లు 2, 3, 4 అంతటా 717 అదనపు సీట్లు, తదుపరి తరం 3డి సామర్థ్యాన్ని అందిస్తాయి. ప్రతీ స్క్రీన్‌లో ప్రేక్షకుడికి ఓ కొత్త అనుభవం కలిగేలా సాంకేతికతను అమర్చాము” అని అన్నారు.