Reading Time: < 1 minute

 కల్తీ అల్లంవెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై రాజేంద్రనగర్ జోన్ పోలీసులు శుక్రవారం దాడి చేశారు. 1800 కిలోల అల్లం వెల్లుల్లి పేస్టు, రెండు కిలోల గమ్ పౌడర్, రెండు కిలోల టైటానియం డై ఆక్సైడ్, సింథటిక్ ఫుడ్ కలర్ (లెమన్ ఎల్లో), ఏడు ప్యాకింగ్ మెషీన్లు, మూడు గ్రైండింగ్ మెషీన్లు, రెండు వెయింగ్ మెషీన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…బహదూర్‌పురాకు చెందిన అబ్దుల్ అలీం శాస్త్రిపురంలోని బాబా కాంటాలో స్టాండర్డ్ ఫుడ్ ప్రొడక్ట్, అబిడ్స్‌కు చెందిన జసాని దిల్దార్ అలీ ఉడంగడ్డ రైల్వే ట్రాక్ సమీపంలో అల్లంవెల్లుల్లి తయారీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. నిందితులు ఎవరికీ అనుమానం రాకుండా నాసిరకం అల్లం, వెల్లుల్లిని సేకరించి, వాటికి ఉప్పు, టైటానియం డై ఆక్సైడ్ వంటి రసాయనాలు, గమ్ పౌడర్‌ను కలిపి అల్లంవెల్లుల్లి పేస్టును తయారు చేస్తున్నారు. పేస్టు చిక్కగా ఉండటానికి,

రంగు కోసం ప్రమాదకరమైన కెమికల్స్ వాడుతున్నారు. దాడి చేసిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు అప్పగించారు. మరో కేసులో పాడైపోయిన డ్రైఫ్రూట్స్ విక్రయిస్తున్న వ్యక్తిని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు, ఫుడ్ అడాల్టరేషన్ టీం, బహదూర్‌పుర పోలీసులు అరెస్టు చేశారు. 30 కార్టన్ బాక్స్‌ల్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ స్వాధీనం చేసుకున్నారు. చార్మినార్‌కు చెందిన అసవా మనీష్ హైదరాబాద్‌లోని చార్మినార్, చేలాపురా ప్రాంతంలో ‘జెమ్ ఫుడ్స్ పేరుతో ఒక గోడౌన్‌ను నిర్వహిస్తున్నాడు. నిందితుడు కావాలనే పాడైపోయిన, బూజు పట్టిన, దుర్వాసన వస్తున్న డ్రై ఫ్రూట్స్‌ను సేకరించి, వాటిని తినడానికి యోగ్యమైన నాణ్యమైన డ్రై ఫ్రూట్స్‌గా చెప్పి విక్రయిస్తున్నాడు. ఇన్స్‌స్పెక్టర్ డి. బిక్షపతి, స్పెషల్ క్రైం టీమ్ సిబ్బంది, ఫుడ్ అడల్టరేషన్ టీమ్, బహదూర్‌పురా పోలీసులు దాడి చేశారు.