Reading Time: 2 minutes

జలమార్గంలో ఇరాన్ మరో టెర్రర్

అత్యంత కీలక బాబ్ జలసంధి మూసివేత

ఇక గల్ఫ్ దేశ నౌకలు చుట్టు తిరిగి పోవల్సిందే

టెహరాన్: పర్షియా గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ మరో తీవ్ర చర్యకు దిగింది. మరో అత్యంత కీలకమైన సముద్ర జల నౌకారవాణా మార్గం బాబ్ ఎల్ మందెబ్ జలసంధిని కూడా మూసివేస్తామని ఇరాన్ సంకేతాలు వెలువరించింది. అమెరికా, మిత్రదేశాలపై తమ ప్రతీకార చర్యలలో భాగంగా తాము సాగిస్తున్న సముద్ర జలాల పోరు క్రమంలో ఈ విస్తారిత చర్యకు దిగుతామని ఇరాన్ సీనియర్ సైనికాధికారి ఒకరు శుక్రవారం తెలిపారు. తమ దేశంపై దాడులతో అమెరికా పెద్ద తప్పు చేసింది. ఇందుకు మూల్యం చెల్లించుకోకతప్పదు. ఇప్పుడు ఏకకాలంలో రెండు కీలక జలమార్గాలలో నౌకారవాణా నిలిచిపోతుంది. దీనితో ప్రపంచవ్యాప్తంగా ఇంధన తీవ్ర సంక్షోభం తప్పదని ఇరాన్ హెచ్చరించింది.

హర్మూజ్ జలసంధిలోని పరిస్థితిని ఇప్పుడు బాబ్ ఎల్ జలసందిలోనూ చూడాల్సి వస్తుందని తెలిపారు. ఈ ప్రాంతం కూడా ఇక ప్రస్తుత యుద్ధం పరిధిలోకి వస్తుంది. ఇరాన్ వద్ద శత్రువును దెబ్బతీసే మరెన్నో ఆయుధాలు ఉండనే ఉన్నాయి. పలు వ్యూహాత్మక చర్యలతో అమెరికా, ఇజ్రాయెల్‌లను దెబ్బతినేలా చేస్తామని ఇరాన్ ప్రతినిధి హెచ్చరించారు. ఇప్పుడు తాము ప్రకటించిన మార్గాలలో అమెరికా లేదా ఇజ్రాయెల్ కొన్ని నిర్ణీత దేశాలు లీటర్ చమురును కూడా తీసుకువెళ్లలేవని ఇరాన్ ప్రతినిధి తెలిపారు. తమ మిత్రదేశాలైన గల్ఫ్‌లోని అమెరికా మిత్రదేశాల నౌకలకు కూడా తమ హెచ్చరిక వర్తిస్తుందని ప్రకటించారు. బాబ్ జలసంధి 26 కిలో మీటర్ల వెడల్పు ఉండే జలమార్గం ఎర్రసముద్రానికి దారితీసే ఈ మార్గం యెమెన్ , జిబౌటిలను కలుపుతుంది.

గల్ఫ్ చమురు ఉత్పత్తి దేశాలకు ఈ మార్గం అత్యంత ఆయువుపట్టు అయిన మార్గంగా ఉంది. ఇది కూడా ఇరాన్ ఆధీనంలోనే ఉంది. ఈ ప్రాంతంలోని హౌతి శక్తులతో కలిసి ఇరాన్ ఇక్కడ తన ఆధిపత్యం చాటుకొంటోంది. ప్రత్యేకించి పర్షియన్ గల్ఫ్ నుంచి యూరప్ దేశాలకు అతి తక్కువ దూరం మార్గం ఈ జలసంధి కావడం, సూయజ్ కెనాల్‌కు కూడా మార్గం ఉండటంతో ఇక్కడ ప్రయాణం నిలిచిపోతే గల్ఫ్, యూరప్ దేశాలకు చిక్కులు ఏర్పడుతాయి. గమ్యం చేరుకోవాలంటే నౌకలు చుట్టుతిరిగి కెప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకు రెండు వారాలకు పైగా క్లిష్ట ప్రయాణం దీనితో పాటు ప్రతి ప్రయాణానికి 1 మిలియన్ డాలర్ల వరకూ అదనపు వ్యయ భారం పడుతుంది.