Reading Time: < 1 minute

లోక్‌సభ నుంచి నన్ను సస్పెండ్ చేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే అల్పాహార విందుకు ఆహ్వానిస్తారా ? అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి విస్మయం చెందారు.ఈ నెల 16న రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే అల్పాహార విందుకు రావాల్సిందిగా తనను ఆహ్వానిస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిందని ఆయన శుక్రవారం మీడియాకు తెలిపారు. తనను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అయితే తనను సస్పెండ్ చేసి ఎలా ఆహ్వానిస్తున్నారని తాను సదరు వ్యక్తిని సున్నితంగా అడిగానని ఎంపీ చామల చెప్పారు.

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రివర్యులే తీసుకొచ్చిన తీర్మానం ద్వారా తనను లోక్‌సభ సమావేశాలకు హాజరుకాకుండా సస్పెండ్ చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రజలు ఎన్నుకుని పంపిన లోక్‌సభలో నుంచి సస్పెండ్ చేసిన తర్వాత రాష్ట్రపతి భవన్‌లో జరిగే అధికారిక అల్పాహార సమావేశానికి తాను ఎలా హాజరుకాగలనని ఆయన తెలిపారు. భువనగిరి ప్రజలు లోక్‌సభలో మాట్లాడేందుకు ఎన్నుకున్నారని, ప్రభుత్వం తనను సభకు దూరంగా ఉంచినప్పుడు బయట జరిగే కార్యక్రమాలకు వెళ్ళేందుకు మనస్కరించదని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.