Reading Time: 2 minutes

ఉమ్మడి ఎపి మాజీ డిజిపి హెచ్‌జె దొర (82) కన్నుమూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి శుక్రవారం విషమించడం తో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. హెచ్‌జె దొర కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన క్రమం తప్ప కుండా డయాలసిస్ చేయించుకుంటున్నారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని నిమ్స్‌లో డయాలసిస్ చేయించుకుని ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత ఆయన బాత్రూంలో పడిపోయినట్టు తెలుస్తోంది. హెచ్‌జె దొర తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు నిమ్స్‌కు తరలించా రు. అత్యవసర చికిత్స అందించినప్పటికీ డాక్టర్ల ప్రయత్నాలు ఫలించలేదు. 1943లో శ్రీకాకుళం జిల్లాలో జన్మించిన దొర పోలీసు విభా గంలో సుమారు 40 ఏళ్ల పాటు విశేష సేవలందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డిజిపిగా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఆయన విశేష సేవలు అందించారు. ప్రధానంగా 1993లో పీపుల్స్ వార్ గ్రూపు లక్ష్యంగా చేసుకున్న 40 మంది కీలక పోలీసు అధికారుల జాబితాలో ఆయన పేరు కూడా ఉంది. నక్సలైట్ ఉద్యమం తీవ్రంగా ఉన్న కాలంలో ఆయన ఎంతో చాకచక్యంగా వ్యవహరించి, అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు.

రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ ఆయన సేవలు విస్తరించాయి. 2002లో కేంద్ర సర్వీసులకు వెళ్లిన దొర ఢిల్లీలో సెంట్రల్ ఇండస్ట్రి యల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్‌ఎఫ్) డిజిపిగా బాధ్యతలు నిర్వర్తించారు. భారత విజిలెన్స్ కమిషనర్‌గా కూడా నియమితులై అత్యున్నత స్థాయి లో సేవలందించారు. వృత్తిపరమైన బాధ్యతలతో పాటు క్రీడారంగం పట్ల దొరకు అమితమైన ఆసక్తి ఉండేది. ఇండియన్ ఒలిం పిక్ వెయిట్ లిఫ్టిం గ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన భారత క్రీడాకారులను ప్రోత్సహించడంలో ఎల్లప్పుడూ ముందుండేవారు. 2006 కామన్వెల్త్ గేమ్స్‌కు భారత బృందానికి ‘చెఫ్ డి మిషన్’గా వ్యవహరించి క్రీడాకారులకు మార్గనిర్దేశన చేశారు. పోలీసు శాఖలో ఆయన కనబర్చిన ప్రతిభకు గుర్తింపుగా రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక పోలీస్ మెడల్‌ను అందుకున్నారు. అదే విధంగా శౌర్యపతకం కూడా దొరను వరించింది. ఆయ న తన సుదీర్ఘ వృత్తి జీవితానుభవాలతో ’జర్నీ త్రూ టర్బ్యులెంట్ టైమ్స్’ పేరుతో ఆత్మకథను కూడా రచించారు. నిరంతరం ప్రజాసేవలో గడిపిన హెచ్.జె.దొర మృతి పట్ల పోలీసు యంత్రాంగం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మరణం ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు రంగానికి తీరని లోటుగా పలువురు ప్రముఖులు అభివర్ణించారు. ఆయన భౌతికకాయానికి తెలంగాణ్ డిజిపి శివధర్ రెడ్డి, హైదరాబాద్ సిటీ కమిషనర్ విసి సజ్జనార్, మాజీ పోలీసు అధికారులు నివాళులర్పించారు.

ఉభయ తెలుగు రాష్ట్రాల సిఎంల సంతాపం

మాజీ డిజిపి హెచ్‌జె దొర మృతి పట్ల ఉభయ తెలుగు రాష్ట్రాల సిఎంలు సంతాపం వ్యక్తం చేశారు. దొర కుటుంబ సభ్యులకు తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా, డిజిపిగా ఆయన సేవలను సిఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. పోలీసు శాఖలో పలు సంస్కరణలు తీసుకురావడంతో పాటు శాఖను ప్రజలకు చేరువ చేయడంలో దొర ఎంతో కృషి చేశారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హెచ్‌జె దొర మృతి పట్ల ఎక్స్ వేదికగా ఎపి సిఎం చంద్రబాబు స్పందిస్తూ హెచ్‌జే దొర మృతి వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. ‘ఏపీ పోలీస్ కు బ్రాండ్ క్రియేట్ చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఎన్టీఆర్ గారి దగ్గర ఇంటెలిజెన్స్ అధికా రిగా, నా హయాంలో రాష్ట్ర డిజిపిగా దొర చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి. నాడు రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న నక్సల్ సమస్య పరిష్కారం లో ఎంతో సమర్థవంతంగా వ్యవహరించారు. హెచ్‌జే దొర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను‘ అని ట్వీట్ చేశారు.