Reading Time: < 1 minute

భారీ జిఎస్‌టి కుంభకోణాన్ని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ బట్టబయల్జేసింది. దాదాపు రూ.84.15 కోట్ల విలువైన మోసపూరిత ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటిసి)ను పొంది, దానిని బదిలీ చేశాడనే ఆరోపణలపై వాణిజ్య పన్నుల శాఖ ఒక వ్యాపారవేత్తను అరెస్టు చేసింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎస్‌కెజి ట్రేడింగ్ కంపెనీ యజమాని సందీప్ కుమార్ గోయెల్ కార్యకలాపాలపై విశ్వసనీయ నిఘా, వివరణాత్మక డేటా విశ్లేషణ ఆధారంగా అధికారులు దర్యాప్తు నిర్వహించారు. వస్తువుల వాస్తవ సరఫరా లేకుండా జారీ చేసిన ఇన్‌వాయిస్‌లను ఉపయోగించి అతను ఐటిసిని పొంది, దానిని బదిలీ చేశాడని, ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు గణనీయమైన నష్టం వాటిల్లిందని దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడు నకిలీ ఇన్‌వాయిస్‌ల ద్వారా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటిసి) పొందినట్లు గుర్తించారు.

సందీప్ కుమార్ గోయె ల్ హెచ్ ఎఫ్‌సి స్టీల్ ట్యూబ్స్ అండ్ వాల్వ్ యజమాని, విజయ్ ఇండస్ట్రియల్ నీడ్స్ ఎల్‌ఎల్‌పిలో భాగస్వామి అని అధికారులు వెల్లడించారు, ఇక్కడ వస్తువులు, సేవలను వాస్తవంగా స్వీకరించకుండానే ఇలాంటి మోసపూరిత ఐటిసి క్లెయిమ్‌లు కనుగొన్నారు.ఈ క్రమంలో వాటి రిజిస్ట్రేష న్లు అధికారులు రద్దు చేశారు. జిఎస్‌టి చట్టం, 2017 నిబంధనల ప్రకారం సందీప్ కుమార్ గోయల్‌ను అరెస్టు చేసి, జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. నకిలీ ఇన్‌వాయిస్‌లు, మోసపూరిత ఐటిసి క్లెయిమ్‌లు, ఇతర జిఎస్‌టి చట్టాల ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఆ శాఖ పేర్కొంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరుగుతోందని తెలంగాణ వాణిజ్య పన్నుల కమిషనర్ వెల్లడించారు.