
పంజాబ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతూ.. ఓ కుర్రాడు ప్రాణాలు విడిచాడు. ఇండియన్ ఫుట్‌బాల్ లీగ్(ఐఎఫ్ఎల్)లోని నాంధారి ఫుట్‌బాల్ క్లబ్‌కు చెందిన పాతికేళ్ల రవీందర్ సింగ్ మృతి చెందాడు. స్థానికంగా జరుగుతున్న ఫుట్‌బాల్ టోర్నీలో రవీందర్ సింగ్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఫుట్‌బాల్ క్లబ్‌లు అతడి మృతికి సంతాపం తెలిపాయి. ఐఎఫ్ఎల్‌లో జరగబోయే మ్యాచ్‌ల సమయంలో ఒక నిమిషం మౌనం పాటించాలని నిర్వాహకులు ప్రకటించారు.
రవీందర్ సింగ్ స్వగ్రామం నవాన్‌షహ్ర జిల్లాలోని బచౌరి. అక్కడే ఆటగాడి అంత్యక్రియలు జరిగాయి. అతడిని చివరిసారిగా చూసేందుకు సహచర ప్లేయర్లు ఫుట్‌బాల్ అభిమానులు భారీగా తరలివచ్చారు. నాంధారి క్లబ్ రవీందర్‌కు నివాళి అర్పిస్తూ.. సోషల్‌మీడియాలో వీడియోని షేర్ చేసింది. మినెర్వా పంజాబ్, గోకులం కేరళ, బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్‌లు ప్రగాఢ సానుభూతిని తెలియజేశాయి.