Reading Time: < 1 minute

తెలంగాణ ఆర్టీసీలో కార్మిక సంఘాల జేఏసి ఆధ్వర్యంలో యాజమాన్యానికి, కార్మిక శాఖ కమిషనర్‌కు శుక్రవారం సమ్మె నోటీసు ఇచ్చారు. టిజిఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంలో చేయడంతో పాటు 2021 వేతన సవరణను 30 శాతం ఫిట్మెంట్‌తో అమలు చేయాలని, మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల రూ.350 కోట్లు కోత లేకుండా ఇవ్వాలని, పాత బకాయిలు రూ.2,500 కోట్లు వెంటనే విడుదల చేయాలని కార్మిక జెఏసి డిమాండ్ చేసింది. ఈ డిమాండ్లపై గత కొన్ని నెలలుగా కార్మిక సంఘాల జేఏసి యజమానపైనా, ప్రభుత్వంపైనా ఒత్తిడి తెస్తున్నా లెక్క చేయకపోవడంతో సమ్మెకు దిగుతున్నట్లు వెల్లడించింది. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెకు వెళతామని హెచ్చరించారు. సమ్మె తేదీపై 14 రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆర్టీసీ జేఏసీ తెలిపింది.

బస్ భవన్‌లో ఆర్టీసీ ఎండీ అందుబాటులో లేకపోవడంతో ఆయన పేషీలో నోటీసులు ఇచ్చారు. లేబర్ కమిషనర్ కార్యాలయంలోనూ నోటీసులు అందజేసినట్లు జేఏసి వర్గాలు తెలిపారు. నోటీసు ఇచ్చిన తర్వాత 14 రోజుల్లోగా ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెకు దిగడం ఖాయమని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, ఉద్యోగులపై అధిక పనిభారం తగ్గించాలని జేఏసీ నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే ఈవీ బస్సుల్లో ఆర్టీసీ ఉద్యోగులే పనిచేయాలని, వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలని సమ్మె నోటీసు ఇచ్చే ముందు బస్ భవన్ వద్ద జేఏసి ఆధ్వర్యంలో ధర్నా చేశారు.