Reading Time: 2 minutes

న్యూఢిల్లీ : ఎల్‌పిజి సంక్షోభంపై శుక్రవారం విపక్ష ఎంపీలు పార్లమెంట్ కాంప్లెక్స్‌లలో నిరసన పాటించారు. ఈ సంక్షోభానికి కేంద్ర పెట్రోలియం మంత్రి హరదీప్‌పురి, ప్రధాని నరేంద్రమోడీ జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. పార్లమెంట్ భవనం బయట శుక్రవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో టిఎంసి ఎంపీలు నిరసన ప్రారంభించారు. “ఎల్‌పిజి సంక్షోభం” అని రాసి ఉన్న పోస్టర్లు పట్టుకుని నినాదాలు చేశారు. “గ్యాస్ సిలిండర్లు ఎక్కడకు వెళ్లాయి ” అని ప్రశ్నిస్తూ పాలకవర్గం బీజేపీని నిలదీశారు. ఈ నిరసనలో కాంగ్రెస్ ఎంపీలు,ఇండియా కూటమికి చెందిన ఇతర ఎంపీలు కలిశారు. గ్యాస్ సిలిండర్లతోపాటు ప్రధాని మోడీ అదృశ్యమయ్యారని, ఆయన పూర్తిగా లొంగిపోయారని ధ్వజమెత్తారు.

“దేశంలో ఎల్‌పిజి సంక్షోభం తీవ్రంగా ఉంది.బెంగాల్‌లో కూడా ప్రధాన డిస్ట్రిబ్యూటర్ల వద్ద సరఫరా వ్యవస్థలకు కుప్పకూలడంతో ప్రజలు చాలా బాధపడుతున్నారు. మాన్యువల్ బుకింగ్‌ను ఆశ్రయిస్తున్నారు. ” అని టిఎంసి ఎంపీ మహువా మొయిత్రా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. “ మీకు కుటుంబాలు ఉన్నాయి. వృద్ధులు, తల్లిదండ్రులు, సిలిండర్లను బుక్ చేసుకోవడానికి క్యూల్లో నిరీక్షిస్తున్నారు. రెండున్నర రోజుల్లో సిలిండర్లు లభ్యమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రకారం ఎక్కడ రెండున్నర రోజుల్లో బుకింగ్‌లో సిలిండర్లు లభ్యమవుతున్నాయో ప్రధానిని ,మంత్రులను వెళ్లి చూడాలని సవాలు చేస్తున్నాను” అని ఆమె సవాలు విసిరారు.

“దేశంలో 75 రోజులకు సరిపడా నిల్వలున్నాయని పెట్రోలియం మంత్రి దేశానికి అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు అత్యావసరాల చట్టాన్ని కూడా అమలు లోకి తెచ్చారు. కేవలం 25 రోజుల్లో లభ్యమవుతాయని అంటున్నారు. మనకన్నీ అబద్ధాలే చెప్పారు. ప్రధాని ఎక్కడ ?గత ఐదు రోజులుగా ప్రధాని సభకు రావడం లేదు. ఈ సంక్షోభం లో కూడా ఆయన కేరళలో ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉంటున్నారు. ఆయన ప్రధానిలా కాకుండా ఎన్నికల యంత్రంలా తయారవుతున్నారు. ఇది నిజంగా సిగ్గు చేటు ” అని మొయిత్రా విరుచుకుపడ్డారు.

కొంతమంది విపక్ష ఎంపీలు గ్యాస్ సిలిండర్ల భారీ కటౌట్లు పట్టుకోగా,మరికొందరు సిలిండర్లు, నినాదాలతో ఉన్న పోస్టర్లు పట్టుకున్నారు. “ మోడీ జీ ఎల్‌పీజీ ” అని నినాదాలు చేశారు. ఏకంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఇండియా కూటమి ఎంపీలు ప్రయత్నించారు. పశ్చిమాసియా సంక్షోభం, భారత్‌పై దాని ప్రభావంపై పూర్తి చర్చ జరగాలని విపక్షం డిమాండ్ చేస్తోంది. బుధవారం ప్రధాని నరేంద్రమోడీ ఆందోళన చెందవద్దని, ప్రజా ప్రయోజనాలను పరిరక్షిస్తామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశంలో కమర్షియల్ ఎల్‌పిజి సరఫరా దెబ్బతిని హోటల్ రంగం అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ఎల్‌పీజీ సంక్షోభం పరిష్కారం అవుతుందన్న నమ్మకాన్ని ప్రధాని వెలిబుచ్చారు.