Reading Time: < 1 minute

వాషింగ్టన్: ఇక ఇరాన్‌ను ఏ కోశానా ఉపేక్షించేది లేదు. మరింత జోరుగా దెబ్బతీస్తామని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. గల్ఫ్ దేశాలపై, ఇజ్రాయెల్‌పై ఇరాన్ భీకర ప్రతీకార దాడులు, చమురు సరఫరా వ్యవస్థలకు ఆటంకాల దశలో ట్రంప్ హెచ్చరిక వెలువడింది. ‘ ఇప్పుడు ఈ నీచులకు, రక్తం మరిగిన రాకాసి నల్లులకు ఏం జరుగుతున్నదో చూడండి. వీరిని ఏరిపారేశాం. పూర్తిగా తుడిచిపెట్టేస్తాం’ అని సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ మీడియాలో స్పందించారు. ఇరాన్ నూతన నేత మొజ్తబా ఖమేనీ తొలిసారిగా సందేశం వెలువరించడం,ఇందులో అమెరికాపై ప్రతీకార దాడులు నిలిపేదిలేదని, తమ కక్ష తీర్చుకుంటామని చెప్పిన తరువాత ట్రంప్ స్పందించారు.

శుక్రవారం ఇరాన్ తెల్లవారుజాము నుంచే గల్ఫ్ దేశాలపై బహుముఖ దాడులకు దిగింది. ప్రత్యేకించి సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలు, అక్కడి అమెరికా సైనిక స్థావరాలను లక్షంగా పెట్టుకుంది. దీనికి ప్రతిగానే ట్రంప్ మాట్లాడినట్లు భావిస్తున్నారు. ఇప్పుడు ఇరాన్‌కు ఏమి మిగిలి ఉంది. నాయకత్వం పోయింది. వారి నౌకాదళం కొట్టుకుపోయింది. వారి వాయుసేన బలం దెబ్బతింది. డీలా పడింది. వారి మిస్సైళ్లు, డ్రోన్ల సంఖ్య తగ్గిపోతోంది. అవి పనిచేయకుండా పోతున్నాయి. . సర్వనాశనం అవుతోంది. వారి నాయకులు ఈ భూమి మీద లేకుండా పొయ్యారు. ఇక వారికి మిగిలిందేముంది. ఇక మరింత తీవ్రస్థాయి దాడులతో ఇరాన్‌పై విరుచుకుపడుతామని ట్రంప్ ప్రకటించారు.