Reading Time: < 1 minute

ప్రాధాన్య రంగాలకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నాం

ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటన

న్యూఢిల్లీ: దేశంలో ఎల్‌పిజి కొరతపై  కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎలాంటి భయాందోళనలు వద్దని, ‘ప్యానిక్ బుకింగ్’ అవసరం లేదని కోరింది. గృహావసరాల కోసం ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా సాగుతోందని స్పష్టం చేసింది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఆసుపత్రులు, హాస్టళ్లకు ఎల్‌పీజీ సరఫరాకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు.

మార్చి 2026తో పోల్చుకుంటే దేశంలో ఎల్‌పీజీ ఉత్పత్తి 40 శాతం పెరిగిందని, అదనంగా రాష్ట్రాలకు 48,000 కిలోలీటర్ల కిరోసిన్ పంపిణీ చేశామని తెలిపారు. హోటళ్లు, రెస్టారెంట్లకు బొగ్గు సరఫరా చేయాలని కోల్ ఇండియాను ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు. మధ్యప్రాచ్యంలో యుద్ధానికి ముందు సాధారణంగా 55.7 లక్షల బుకింగ్‌లు ఉంటే మార్చి 12 నాటికి అది 75.7 లక్షలకు పెరిగిందనారు. ఎదో జరుగబోతోందన్న భయాల కారణంగానే బుకింగ్‌లు అనూహ్యంగా పెరిగాయని సుజాతా శర్మ తెలిపారు.

ఎల్పీజీపై ఒత్తిడి తగ్గేందుకు పీఎన్‌జీ కనెక్షన్లకు మళ్లాలని ప్రజలను కోరారు. క్రూడాయిల్‌కు సంబంధించి 258 మిలియన్ మెట్రిక్ టన్నుల రిఫైనింగ్ కెపాసిటీ ఉందని, పెట్రోల్, డీజిల్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని కలిగి ఉన్నామని వివరించారు. ప్రధానమైన అర్బన్ సిటీలు, కేంద్రాల్లో కమర్షియల్ వినియోగదారుల ఆందోళన, సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని చెప్పారు.