
ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు యాజమాన్యాలు వెనుకంజ వేసే ప్రమాదం
కొలువుల భర్తీలోనూ ప్రతికూలతలు ఎదురవుతాయి
సిజెఐ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : మహిళా ఉద్యోగులకు ‘నెలసరి’ సెలవుల అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా మహిళలకు, విద్యార్థినులకు వేతనంతో కూడిన నెలసరి సెలవు అమలు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యంపై విచారణ జరిపిన సిజెఐ నేతృత్వంలో ధర్మాసనం శుక్రవారంనాడు దానిని తిరస్కరించింది. సెలవును తప్పనిసరి చేస్తే మహిళల కెరీర్ ముగుస్తుందన్నారు. వేతనంతో కూడిన నెలసరి సెలవు అంశంలో పలు అభ్యంతరాలు ఉన్నాయని సిజెఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.
నెలసరి సెలవులు ఇస్తే మహిళలను ఉద్యోగాల్లో తీసుకునేందుకు యాజమాన్యాలు వెనుకంజ వేసే ప్రమాదం ఉందని అన్నారు. తద్వారా వారి ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. సంస్థల యాజమాన్యాల మనస్తత్వం మీకు తెలియదని పిటిషనర్‌ను ఉద్దేశించి ధర్మాసనం పేర్కొంది. వాలంటరీగా సెలవులు ఇవ్వడమనేది చెప్పుకోవడానికి బాగుటుంది కానీ చట్టం చేసి తప్పనిసరి చేస్తే వివిధ రంగాల్లోని ఉద్యోగాల భర్తీలో కూడా వాళ్లకు ప్రతికూలతలు ఉంటాయన్నారు.
అదే విధంగా పురుషుల కన్నా తాము తక్కువ అనే భయ భావన వారిలో కలిగే అవకాశముందనారు. నెలసరి వల్ల ఏదో చెడు జరుగుతోంది అన్న విషయాన్ని వ్యాప్తి చేయడం మంచిది కాదని, అది మహిళలను ఆత్మనూన్యతకు గురిచేసేలా ఉంటుందని సిజెఐ అభిప్రాయపడ్డారు. అయితే ప్రభుత్వాలు స్టేక్‌హోల్డర్లతో చర్చించి నెలసరి సెలవు విధానాన్ని రూపొందించే అంశాన్ని పరిశీలించాలని ఆదేశిస్తూ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. కేరళ రాష్ట్రంలోని స్కూళ్లలో ఆడపిల్లలకు నెలసరి సెలవు ద్వారా వారికి ఊరటనిస్తున్నారని, కొన్ని ప్రైవేట్ కంపెనీలు వాలంటరీగా అమలు చేస్తున్నాయని, దేశవ్యాప్తంగా కూడా తప్పనిసరి చేస్తూ చట్టం చేయాలని న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌పై శుక్రవారంనాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
సీనియర్ న్యాయవాది షంషద్ వాదనలు వినిపిస్తూ.. 2013లో ప్రభుత్వ విశ్వవిద్యాలాయాల్లో నెలసరి సెలవురు మంజూరు చేసిన విషయాన్ని గుర్తుకు తెచ్చారు. ప్రైవేటు కంపెనీలు అదే బాటలో పయనిస్తే బాగుంటుందన్నారు. ఈ సమయంలో సిజెఐ కలుగుజేసుకొని.. ఆ సమయంలో వారు స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయాలనీ, చట్టం చేయాలన్న డిమాండ్ విషయానికి వస్తే అది మహిళ కెరీర్ ముగింపునకు దారులు వేయడమేని అన్నారు.