
హైదరాబాద్: ఉమ్మడి ఎపి మాజీ డిజిపి హెచ్‌జె దొర కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన శుక్రవారం నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. శుక్రవారం ఉదయం డయాలసిస్ చేయించుకొనేందుకు దొర నిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. ఆ తర్వాత ఇంటికి వచ్చాక.. ప్రమాదవశాత్తు బాత్‌రూమ్‌లో జారి పడినట్లు తెలుస్తోంది. కుటుంబసభ్యులు మళ్లీ ఆయన్ను నిమ్స్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
ఎపిలోని శ్రీకాకుళం జిల్లాలో 1943లో హెచ్‌జె దొర జన్మించారు. ఆయన 1965 ఐపిఎస్ బ్యాచ్ ఎపి క్యాడర్‌కు చెందిన అధికారి. వివిధ హోదాల్లో పని చేసిన ఆయన 1996లో డిజిపిగా పదోన్నతి పొందారు. 2002లో సిఐఎస్ఎఫ్ డిజిగా డిప్యుటేషన్‌పై వెళ్లారు. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఆయన కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.