
గువాహటి: ఈశాన్య ప్రాంతాలకు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే వారికి ఇప్పుడు ప్రయాణం మరింత సులభతరం కానుంది. చర్లపల్లి నుంచి అస్సాంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కామాఖ్య వరకూ వెళ్లే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ ఎక్స్‌ప్రెస్ స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో సేవలు అందించనుంది. దీంతో ఈశాన్య ప్రాంతాలకు వెళ్లే వారు ఇప్పుడు తక్కువ ఖర్చుతో సులభతరమైన ప్రయాణం చేసే వీలుంది. ఈ రైలు మార్గ మధ్యంలో ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లోని శ్రీకాకులం రోడ్, విజయనగరం జంక్షన్, పెందుర్తి, దువ్వాడ, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నల్గొంట స్టేషన్‌లలో ఆగుతుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌తో పాటు న్యూజల్పాయ్‌గురి నుంచి గువాహటి వరకూ వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ని, నారంగి నుంచి త్రిపుర రాజధాని మధ్య ప్రయాణించే ఎక్స్‌ప్రెస్‌ని కూడా మోడీ ప్రారంభించారు.