
టి-20 ప్రపంచకప్ ముగిసినా.. దానిపై చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. మార్చి 8న జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి.. భారత్ విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మేరకు భారత్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. టీం ఇండియాను ప్రశంసలతో ముంచెత్తిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్.. ఓ జట్టుని ఈ టోర్నమెంట్‌లో అత్యంత తెలివి తక్కువ జట్టుగా అభివర్ణించారు. అదే దక్షిణాఫ్రికా. సూపర్-8లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓడిపోయి ఉంటే.. భారత్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించి ఉండేదని వాన్ అభిప్రాయపడ్డారు.
సూపర్-8లో టీం ఇండియా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో దారుణంగా ఓడిపోయింది. దీంతో నెట్ రన్‌రేట్ మైనస్‌కు చేరి.. సెమీస్ అవకాశాలను కష్టతరం చేసుకుంది. కానీ, జింబాబ్వే, వెస్టిండీస్‌పై విజయం సాధించి.. సెమీస్‌కు చేరి.. సెమీస్‌లో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించి.. ఫైనల్స్‌కు చేరి.. ఆ తర్వాత వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది. మరోవైపు దక్షిణాఫ్రికా మాత్రం సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడి.. టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.
దీనిపై మైఖేల్ వాన్ మాట్లాడుతూ.. ‘‘ఈ టోర్నమెంట్‌లో అత్యంత తెలివి తక్కువ జట్టు దక్షిణాఫ్రికా. ఎందుకంటే సూపర్-8లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయి ఉంటే.. భారత్ టోర్నమెంట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చేది. కానీ, ఆ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలిచి భారత్‌కు మరోసారి అవకాశం కల్పించింది. ఆ తర్వాత భారత్ జింబాబ్వే, వెస్టిండీస్‌పై విజయం సాధించి సెమీస్‌కు చేరింది. ఇలాంటివి జరగకూడదు. సాధారణంగా జరగవు కూడా. కానీ.. మీరు వరల్డ్‌కప్ గెలుచుకోవాలంటే.. ఉత్తమ జట్టును తొందరగానే టోర్నీ నుంచి బయటకు పంపాలి’’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో మైఖేల్ వాన్ అన్నాడు.