
పశ్చిమబెంగాల్‌లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితాల సవరణ (ఎస్‌ఐఆర్)ను ఎన్నికల కమిషన్ చేపట్టిన తరువాత అనేక అవకతవకలు ఉన్నాయని దాదాపు 63 లక్షలమంది జాబితాలనుంచి తొలగించబడ్డారు. దీనిపై భారీ ఎత్తున ఓటర్ల నుంచి ఆందోళనలు లేచాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ సమస్యను తానే చేపట్టి సుప్రీం కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నిన్నమొన్నటివరకు దీనిపై ధర్నా కూడా సాగించారు. ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా వచ్చే పిటిషన్లను విచారించడానికి సుప్రీం కోర్టు అపిల్లేట్ ప్యానెళ్లను ఏర్పాటు చేయించింది. ఈ ప్యానెళ్లను నిర్వహించడానికి హైకోర్టు మాజీ జడ్జీల సేవలను వినియోగించుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఫిబ్రవరి 28న ఓటర్ల తుది జాబితాల నుంచి 63 లక్షలమంది తొలగించబడగా, 10 లక్షలమంది నుంచి మాత్రమే ఫిర్యాదులు వచ్చాయి. ఈ 10 లక్షల ఫిర్యాదులను రెండు నెలల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందే అపిల్లేట్ ప్యానెళ్లు పరిశీలించడం పూర్తవుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఫిర్యాదులను పైపైన పరిశీలించినా సరే నిర్ణయం తీసుకోవడానికి తగినంత సమయం పడుతుందని ఎవరైనా విశ్వసిస్తారు. ఈ వ్యవస్థను పటిష్టం చేయడానికి సుప్రీం కోర్టు, ఎన్నికల కమిషన్ కలిసి ఎక్కువ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది జడ్జీలను అభ్యర్థించినా, చాలా సమయమే పడుతుందని అంచనా వేస్తున్నారు.
సుప్రీం కోర్టు రూపొందిస్తున్న కొత్త అపిల్లేట్ విధానం ప్రకారం ప్రతీ అప్పీలును యోగ్యత ఆధారంగా పూర్తి స్థాయిలో విచారించి నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయమే పడుతుంది. ముక్తసరిగా చెప్పాలంటే ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి సుప్రీం కోర్టు, ఎన్నికల కమిషన్ పరుగుపందెం వేసుకున్నా సమయం తక్కువగా ఉండడంతో పూర్తి అవుతుందో లేదో చెప్పలేం. ఈ పరిస్థితిలో ఈ ప్రక్రియను ఎలాగైనా పూర్తి చేయాలన్న అత్యుత్సాహం ఎందుకు? రూఢిగా చెప్పాలంటే ఇలాంటి ఈ జాబితాల సవరణ పూర్తయిన తరువాతనే ఓటింగ్ నిర్వహించాలని కచ్చితంగా నిర్ధారించే చట్టం ఏదీ లేదు. అప్పెల్లెట్ లేదా ఎన్నికల కమిషన్ తీర్పు ప్రకారం గుర్తింపు పొందిన వారికే ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి అనుమతిస్తారు. ఓటర్ల జాబితాలో అన్ని ఎంట్రీలను కలిగి ఉన్న, మంజూరు చేయబడిన పత్రం తప్పనిసరి అని ఎన్నికల కమిషన్ స్పష్టం చేస్తోంది. అది కూడా ఈ దేశానికి చెందిన చట్టబద్ధమైన పౌరులై ఉండాలని వివరించింది. దీనిని ఏ రాజకీయ పార్టీ లేదా పౌరుడు లేదా కోర్టులు కూడా కాదనలేరు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశంలో ఎనిమిదిసార్లు ఓటర్ల జాబితాల సవరణ జరిగింది. నిజానికి ఇప్పుడు లేవదీస్తున్న అభ్యంతరాలు గతంలో ఎప్పుడూ లేవదీయడం జరగలేదు.
మునుపటి అన్ని సందర్భాల్లోనూ తాజాగానే సజావుగా జాబితాలు తయారయ్యాయి. ఓటర్లకు పెద్దగా ఎలాంటి ఆటంకాలు ఎదురు కాలేదు. ఈ సందర్భంగా గ్రీకు గణిత శాస్త్ర పండితుడు యూక్లిడ్ ఆనాడు ఈజిప్టు రాజు ఒకటో టోలెమీతో ఏమన్నారో ఇక్కడ ప్రస్తావించ వలసి ఉంది. ఏదేమైనా రేఖాగణితం నేర్చుకోవడానికి రాజమార్గం అంటూ ఏదీ లేదని యూక్లిడ్ నిష్కర్షగా ప్రకటించారు. అదే విధంగా ఇప్పుడు సుప్రీం కోర్టు, ఎన్నికల కమిషన్ పౌరులు ఓటు వేసేలా హక్కు కల్పించడమే ముఖ్యం తప్ప విధానాలు వెతకడం అనవసర కాలయాపనే అవుతుంది. సుప్రీం కోర్టు, ఎన్నికల కమిషన్, అపిల్లేట్ వ్యవస్థలు ఇవన్నీ పౌరుల అత్యంత పవిత్రమైన ఓటు హక్కును కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి రాజమార్గం అంటూ ఏదీ లేదని గమనించాలి. అయితే ఈ ప్రక్రియలో పౌరులకు న్యాయం జరగడానికి కొంత సమయం తీసుకుంటుంది. అందువల్ల ఎవరైనా ఓర్పుగా ఉండడం అవసరం. ఎన్నికల కమిషన్ లేదా సుప్రీం కోర్టు తదితర సంస్థల్లో ఎవరు ఉన్నత స్థానాల్లో కూర్చున్నా వారి కర్తవ్యం ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించడమే. ఎవరి ఓటు హక్కునూ అణగదొక్కే అధికారం ఎవరికీ లేదు. భారతీయులకు స్వాతంత్య్రం జన్మహక్కు.
ఎన్నో కష్టనష్టాలు సుదీర్ఘకాలం అనుభవించి సాధించుకున్నారు. ఆ సాధనలో అడ్డుగా నిలబడే హక్కు ఎవరికీ లేదు. అందుకే అర్హులైన ఓటర్లు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.ఓటు హక్కు లేకుంటే ఎవరైనా చనిపోయినట్టే భావిస్తుంటారు. అలాంటి పరిస్థితి కలగకూడదు. పశ్చిమబెంగాల్‌లో 60 లక్షల మంది జాబితానుంచి అదృశ్యం కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 7.04 కోట్ల మందే ఓటర్లు నికరంగా తేలారని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అందుకనే జాబితాలో లేని వారు న్యాయపరిధిలో ఉన్నట్టు పరిగణించి వారి వినతులను పరిష్కరించడానికి హైకోర్టు మాజీ న్యాయమూర్తులతో అప్పిలేట్ ట్రిబ్యునళ్లు ఏర్పడుతున్నాయి.
ఈ ప్రక్రియ ముగిశాకనే బెంగాల్‌లో ఎన్నికలు జరుగుతాయా లేక ముందే పూర్తి అవుతాయా అన్నది చెప్పలేకపోతున్నారు. ఇదిలా ఉండగా చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అధికార బిజెపికే కొమ్ము కాస్తున్నారని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. ఆ పదవి నుంచి తొలగించాలనే తీర్మానాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నాయి. సిఇసి అభిశంసనకు లోక్‌సభ స్పీకర్ మాదిరిగానే లోక్‌సభలో నోటీసు ఇవ్వడానికి కనీసం 100 మంది సభ్యులు, రాజ్యసభలో 50 మంది సభ్యులు సంతకాలు చేయాలి. సుమారు 120 మంది లోక్‌సభ సభ్యులు, 60 మంది రాజ్యసభ సభ్యుల నుంచి సంతకాలు సేకరించాయని తెలుస్తోంది. సిఇసిపై పార్లమెంట్‌లో అవిశ్వాసం నోటీస్ ఇవ్వడం ఇదే తొలిసారి అవుతుంది.