Reading Time: 3 minutes

జలమే జగతికి ప్రాణాధారం.. జలమే ప్రగతికి మూలాధారం’ అని పెద్దలు చెప్పిన మాటలను ప్రయోగాత్మకంగా అక్షర సత్యం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణ బృహత్ కార్యక్రమం చేపట్టడం ఆదర్శంగా నిలిచింది. చరిత్రాత్మకమైన హైదరాబాద్‌ను ఒకప్పుడు ‘చెరువుల నగరం’ అని పిలిచేవారు. నగర అభివృద్ధికి ముందు ఇక్కడ వేల సంఖ్యలో చెరువులు ఉండేవి. ఈ చెరువులు వర్షపు నీటిని నిల్వచేసి నగరానికి తాగునీరు, సాగునీరు, వరద నియంత్రణలో కీలక పాత్ర పోషించేవి. కానీ నగర విస్తరణ, రియల్ ఎస్టేట్ అభివృద్ధితోపాటు ఆక్రమణల వల్ల చాలా చెరువులు నేడు కబ్జాలకు గురయ్యాయి. కనుమరుగవుతున్న చెరువులతో నగర భవిష్యత్తు ప్రమాదరకంగా మారుతున్న విషయాన్ని పసిగట్టి పరిస్థితులను చక్కదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం కట్టింది. హెచ్‌ఎండిఎ పరిధిలో చెరువుల పరిరక్షణకు హైద్రాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)కు పూర్తి అధికారాలు ఇవ్వడంతో ఆ ఫలాలు ఇప్పుడు నగర ప్రజలకు అందుతున్నాయి.

నిజాం పాలనలో నీటి నిర్వహణకు, చెరువులకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు. హైదరాబాద్ చుట్టూ చిన్న పెద్ద కలిపి వేల వరకు చెరువులు ఉండేవి. ముఖ్యంగా 1908లో మూసీ నది వరదల తర్వాత నగరాన్ని రక్షించేందుకు నిజాం పాలకులు అనేక చెరువులు, రిజర్వాయర్లు అభివృద్ధి చేశారు. హుస్సేన్‌సాగర్, మిర్ ఆలమ్ ట్యాంక్, సరూర్‌నగర్ చెరువు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వంటి చెరువులు నగరానికి ముఖ్యమైన నీటి వనరులుగా వెలిశాయి. ఇవి తాగునీరు, సాగునీరు, వరద నియంత్రణలో కీలక పాత్ర పోషించేవి. కాలానుగుణంగా నగరం అభివ ద్ధి చెందుతున్న దశలో చెరువుల సంఖ్య తగ్గుతూ వచ్చాయి. గత మూడు, నాలుగు దశాబ్దాల్లో నగర విస్తరణ వల్ల అనేక చెరువులు పలు కాలనీలు, రోడ్లు కమర్షియల్ భవనాలుగా మారిపోయాయి. గ్రేటర్ నగరంలో చెరువుల పునరుద్ధరణతో పాటు చరిత్రాత్మకమైన మూసీ నది పరిరక్షణకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ పలు చర్యలు చేపట్టింది. అప్పట్లో సుమారు 3000కు పైగా చెరువులు హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నట్లు చరిత్ర చెబుతున్నా పలు పరిశోధనల సంఖ్యలో కొంత తేడాలు కనిపిస్తున్నాయి.

నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఎస్‌ఎ) నివేదిక ప్రకారం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో 900లకు పైగా చెరువులు ఉండగా 280కి పైగా పూర్తిగా మాయమయ్యాయి. 200కు పైగా పాక్షికంగా ఆక్రమాల పాలయ్యాయి. కుంటలు, చెరువులు పేర్లు మాత్రమే మిగిలాయి. మహానగరంలో కుంచించుకుపోయిన చెరువులకు హైడ్రా పుణ్యమా అని పునరుజ్జీవం పొందుతూ ఆహ్లాద, పర్యాటక కేంద్రాలుగా మారుతున్నాయి. నీటి వనరుల పరిరక్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆశయాల మేరకు 2024 జులై 19న ఏర్పాటైన హైడ్రా ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అనే విభేదాలు లేకుండా నగరం నలువైపులా ఇప్పటి వరకు యాభైకి పైగా చెరువుల్లో ఆక్రమణలను తొలగిస్తూ సుమారు 275 ఎకరాల విస్తీర్ణంలో కబ్జాలను తొలగించడమే కాకుండా కోట్లాది రూపాయలు వెచ్చించి సుందరంగా తీర్చిదిద్దుతుంది. మొత్తం 47 చెరువుల అభివృద్ధికి రూ. 160 కోట్లకుపైగా ఖర్చు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న చెరువులు మురికికూపంగా మారి దుర్వాసన వెదజల్లుతుండగా, ఇప్పుడు చాలా చోట్ల ఉద్యానవనంలా మారాయి. చెత్త కుప్పగా ఉండే అంబర్‌పేటలోని బత్తుకమ్మకుంటలో గత దసరాకి ఆనందంగా బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ప్రముఖుల చేతిలో కబ్జాకు గురైన మాదాపూర్ తమ్మిడికుంట చెరువు, సున్నం చెరువులు అందుబాటులోకి వచ్చాయి. అభివృద్ధి పనులు కొనసాగుతున్న సున్నం చెరువు విస్తీర్ణం కబ్జాల తొలగింపు అనంతరం 16.41 ఎకరాల నుండి 30.5 ఎకరాలకు చేరుకుంది. సుందరీకరణ పనులు జరుగుతున్న ఉప్పల్ నల్లచెరువు కబ్జాలతో 52.5 ఎకరాలకు కుంచించుకుపోగా వాటిని తొలగించడంతో 67.31 ఎకరాలకు చేరుకుంది. దుర్గంచెరువు, సరూర్ నగర్ చెరువు, ఫాక్స్ సాగర్ చెరువు, నల్లగండ్ల చెరువులపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పాతబస్తీలో కబ్జాకి గురై 4.12 ఎకరాలున్న బుమ్రుక్ దౌల చెరువును 17.05 ఎకరాల్లో అభివృద్ధి చేసింది. కూకట్‌పల్లిలో 16 ఎకరాలకు కుచించుకుపోయిన నల్లచెరువును 30 ఎకరాల విస్తీర్ణంలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. ఇవేకాక రెండో దశలో మరో 14 చెరువుల అభివృద్ధికి హైడ్రా కంకణం కట్టుకుంది.

చెరువుల నగరం హైదరాబాద్‌లో చెరువులు పరిరక్షించాలనే సంకల్పంతో అడుగులేస్తున్న తెలంగాణ ప్రభుత్వం అదే సమయంలో మూసీ సుందరీకరణకు కూడా కంకణం కట్టుకుంది. గ్రేటర్ నగరానికి మణిహారంగా ఉన్న మూసీ నది ఇప్పుడు మురికికూపంగా మారిన దశలో ప్రభుత్వం మొదటి దశలో రూ. 5812 కోట్ల అంచనాలతో పనులు ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రాజెక్టు నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం నుండి సుమారు రూ. 14 వేల కోట్లను ఆశిస్తున్న తెలంగాణ ప్రభుత్వం అదనంగా రూ. 4 వేల కోట్లను ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నుండి రుణంగా తీసుకోనుంది. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా నగరం నడిబొడ్డున మూసీ నది తీరంలో ఉన్న బాపూ ఘాట్‌ను ఆహ్లాదకరంగా సుందరీకరించేందుకు ప్రణాళికలు రూపొందించిన ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో 2028 నాటికి పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

జాతిపిత మహాత్మాగాంధీ అస్థికలను నిమజ్జనం చేసిన 68 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బాపుఘాట్‌ను టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దాలని సంకల్పించిన ప్రభుత్వం ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్టును రూపొందిస్తున్నది. ఇక్కడ 100 అడుగల ఎత్తులో గాంధీ విగ్రహంతోపాటు చుట్టూ గాంధీ స్మారక్ పార్క్, మ్యూజియం, ధ్యాన కేంద్రం, వాకింగ్ ట్రాకులు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా భూసేకరణ, నిధుల ఖర్చుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న దశలో స్వయంగా ముఖ్యమంత్రి వివరణ ఇస్తూ గాంధీ విగ్రహం కోసం రూ. 70 కోట్లు, ప్రాజెక్టులో భాగంగా ఇతర పనుల కోసం మొత్తం రూ. 200 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పడంతో గాంధీ సరోవర్‌పై అపోహలు తగ్గాయి. హైదరాబాద్‌లో ఇటీవల తరుచూ భారీ వర్షాలు కరుస్తున్న నేపథ్యంలో చెరువులు, కుంటలు వరదలను నియంత్రిస్తాయి. భూగర్భ జలాలతో పాటు జీవవైవిధ్యం కూడా పెరుగుతుంది. ఉష్ణోగ్రతల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. ఇందుకు ప్రభుత్వం చేపట్టే చర్యలతో ప్రజల భాగస్వామ్యం కూడా కీలకమే. చెరువుల సంస్కృతితో వెలుగొందిన హైదరాబాద్‌లో కాలక్రమేణా ఆక్రమణలు, నిర్లక్ష్యంతో నీటి వనరులు కనుమరుగయ్యాయి. అయితే ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక చర్యలతో నగర జల వనరుల పునరుద్ధరణపై ఆశలు రేగుతున్నాయి. చెరువుల పునర్జీవంతోపాటు మూసీ సుందరీకరణ కూడా పూర్తయితే గ్రేటర్ హైదరాబాద్ పర్యావరణ పరిరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది.

-ఐవి మురళీకృష్ణ శర్మ