Reading Time: 3 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: నెట్‌ఫ్లిక్స్ ఇక్కడకు వచ్చిందంటే హైదరాబాద్‌కు హాలీవుడ్ వచ్చినట్లేనని, నెట్‌ఫ్లిక్స్‌ను హైదరాబాద్‌కు ఆహ్వానిస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఓటిటి దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో కార్యాలయాన్ని హైటెక్ సిటీలో గురువారం సిఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుందని, నెట్ ఫ్లిక్స్ కు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ఆయన చెప్పారు. బాల్యం నుంచే తనకు సినిమాలపై ఆసక్తి ఉందని తన చిన్నతనం నుంచి ఇ ప్పటివరకు సినిమాలో అనేక మార్పులు వచ్చాయన్నారు. బాహుబలి, కల్కి, ఆర్‌ఆర్‌ఆర్, అరుంధతి వంటి అత్యున్నత సాంకేతికతో కూడిన సినిమాలు వచ్చాయని సిఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. తెలు గు చిత్రపరిశ్రమను చెన్నై నుంచి ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాద్‌కు తీసుకువచ్చారని ఆయన తెలిపారు.

డివిడి అద్దె సంస్థ నుంచి వరల్డ్ ఓటిటి లీడర్‌గా నెట్ ఫ్లిక్స్ ఎదిగిందని, మీడియా స్టూడియోగా నెట్ ఫ్లిక్స్ ఎదగడం చూస్తుంటే సం భ్రమాశ్చర్యంతో పాటు ఆదర్శంగా అనిపిస్తుందని ఆయన అన్నారు. నెట్‌ఫ్లిక్స్, హైదరాబాద్ రెండిం టి వృద్ధి అంతర్జాతీయంగా దినదిన ప్రవర్థమానం అవుతోందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. నెట్ ఫ్లి క్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రతిభ, మంచి కంటెంట్‌ను సేకరించి వీక్షకులకు అందిస్తుందన్నారు. అందరికీ ఎంటర్‌టైన్‌మెంట్ఇ వ్వడమే నెట్‌ఫ్లిక్స్ ధ్యేయమని ఆయన తెలిపారు. దీంతోపాటు హైదరాబాద్ ప్రపంచ సంస్థలకు వేదిక అవుతూ అన్ని రకాల సంస్కృతీ, సంప్రదాయాలను నగరం గౌరవిస్తోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ, నెట్‌ఫ్లిక్స్‌లు సమాజంలో జరుగుతున్న మార్పులను స్వీకరిస్తూ ముందుకు కదులుతున్నాయని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. నిజాం కాలం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆహ్లాదకరమైన నగరంగా హైదరాబాద్ విరాజిల్లుతోందని ఆయన తెలిపారు.

అయితే, ఇప్పుడు హైదరాబాద్ ఎన్నో రంగాల్లో ఎదిగిందని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా నెట్ ఫ్లిక్స్‌ను, హైదరాబాద్‌ను అందరూ ప్రేమిస్తారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎందుకంటే, ఈ రెండు ఎంతోమందికి ఫుడ్, ట్రావెల్, హిస్టరీ, హెరిటేజ్, సంస్కృతీ, సంప్రదాయాలను అందిస్తున్నాయన్నారు. నెట్ ఫ్లిక్స్ ఐలైన్ ఇక్కడకు రావడంతో ప్రపంచ ప్రేక్షకులకు తెలంగాణ స్థానిక సంస్కృతీ, సంప్రదాయాలను చూపించే అవకాశం దొరుకుతుందన్నారు. నెట్ ఫ్లిక్స్ ఇటీవల క్రీడలపై చాలా దృష్టి పెట్టిందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో నెట్ ఫ్లిక్స్ క్రీడా ప్రసార సంస్థగా మారుతుందని భావిస్తున్నామని సిఎం అన్నారు. తెలంగాణ కూడా క్రీడలపై కూడా కీలకంగా దృష్టి కేంద్రీకరించిందని, క్రీడా మౌలిక సదుపాయాలను నిర్మించడం, క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం, క్రీడలకు సంబంధించి అన్ని స్థాయిల్లో ప్రతిభను ప్రోత్సహిస్తున్నామని ఆయన అన్నారు. ఇందుకు నెట్‌ఫ్లిక్స్ సహకారం అవసరమని ఆయన తెలిపారు. ప్రపంచ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ఇండియా, తెలంగాణ ఎంతటి పాత్రను పోషించబోతున్నాయో తెలిపేందుకు ఈరోజు జరిగిన కార్యక్రమమే ఒక పెద్ద ఉదాహరణగా ఆయన తెలిపారు.

భూమి ఇచ్చేందుకు రెడీ

నెట్‌ఫ్లిక్స్‌కు ఇది దేశంలోనే రెండో కార్యాలయం అని సిఎం పేర్కొన్నారు. తమ దృష్టి హాలీవుడ్ పైనే అని తాను గతంలోనే చెప్పానని ఆయన తెలిపారు. నెట్ ఫ్లిక్స్‌తో నాకల నిజం కాబోతుందని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఫోర్త్ సిటీని నిర్మిస్తున్నామని, నెట్ ఫ్లిక్స్ విస్తరణకు కావాల్సిన భూమిని ఫ్యూచర్ సిటీలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. నెట్ ఫ్లిక్స్ కార్పొరేట్ ఆఫీస్‌ను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని కోరుతున్నానన్నారు. ప్రపంచంలో ఉన్న 500 పెద్ద కంపెనీలు తెలంగాణకు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలంగాణలో మీ పెట్టుబడికి పూర్తి రక్షణ ఉంటుందని సిఎం రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. తెలంగాణ అంటేనే వ్యాపారం అని ఆయన తెలిపారు.

‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో స్టూడియోను ఏర్పాటు చేయండి: మంత్రి శ్రీధర్‌బాబు

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్, గేమింగ్, కామిక్స్ (ఏవిజీసి) రంగంలో హైదరాబాద్‌ను గ్లోబల్ లీడర్‌గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఓ వైపు అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూనే మరోవైపు స్కిల్లింగ్, రీ -స్కిల్లింగ్, అప్ – స్కిల్లింగ్ పై దృష్టి సారించిందన్నారు. హైదరాబాద్‌కు నెట్ ఫ్లిక్స్ రాకతో సినిమా స్టోరీ టెల్లింగ్‌లో తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తమవుతుందన్నారు. ప్రపంచ స్థాయి ప్రొడక్షన్ స్టాండర్డ్, అడ్వానస్డ్ టూల్స్, ఇన్నోవేషన్-లెడ్ వర్క్ ఫ్లో ఇక్కడి ఎకో సిస్టంలో భాగమవుతాయని, ఇక్కడి యువతకు ఫ్యూచర్ రెడీ స్కిల్స్ లభిస్తాయన్నారు. పరిశ్రమల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో భాగస్వామ్యం కావాలని నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులను మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో స్టూడియోను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ఆయన ఆహ్వానించారు.

డిజిటల్, వినోద రంగాలకు కేంద్రంగా హైదరాబాద్

ఈ సందర్భంగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజూ మాట్లాడుతూ సృజనాత్మక సాంకేతికతలు, దృశ్య శ్రవ్య కథన రీతులు, డిజిటల్, వినోద రంగాలకు కేంద్రంగా హైదరాబాద్ విస్తరిస్తోందన్నారు. వేగంగా విస్తరిస్తున్న మీడియా, వినోద రంగ మౌలిక సదుపాయాలతో ప్రతిభకు, ఆవిష్కరణలకూ శక్తిమంతమైన కేంద్రంగా ఈ నగరం నిలిచిం దని ఆయన వ్యాఖ్యానించారు. అద్భుతమైన కథన వారసత్వం భారత్‌కు ఉందని, సాంకేతిక పురోగతి వల్ల కథనం తీరు తెన్నులు, వేదికల్లో వేగంగా మార్పులొస్తున్నాయని ఆయన అన్నారు. వినోదం నేడు కళ, సాంకేతికతల సమ్మేళనంగా మారిందని, ఐలైన్ స్టూడియోస్ వంటి కార్యక్రమాలు భవిష్యత్ తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. గతేడాది ముంబయిలో నిర్వహించిన ప్రపంచదృశ్య, శ్రవణ వినోద సదస్సును ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. సృజనాత్మక, సాంస్కృతిక రంగాలపై ప్రధానంగా దృష్టి సారించే ‘ఆరెంజ్ ఎకానమీ’ ఆవశ్యకతను ప్రధానమంత్రి ప్రత్యేకంగా వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.