
టెహ్రాన్: హతుడైన ఖమేనీ వారసుడిగా ఇరాన్ సుప్రీం నేతగా వచ్చిన మొజ్తబా ఖమేనీ గురువారం తొలిసారిగా అధికారిక ప్రకటన వెలువరించారు. అమెరికా, ఇజ్రాయెల్‌లపై తమ దేశ ప్రతీకార దాడులు సాగుతాయని ఆయన హెచ్చరించారు. ఆయన వెలువరించిన ప్రకటనను ఇరాన్ అధికారిక మీడియా సంస్థల ద్వారా ప్రసారం చేశారు. త మ దేశాన్ని గాయపర్చిన శత్రువుపై మరిన్ని భీకర దాడు లు ఉంటాయని తెలిపారు. ప్రత్యేకించి శత్రువుపై పలు విధాలుగా ఒత్తిడి తీసుకురావల్సి ఉంది. ఇందుకు తమ దేశం నుంచి హర్మూజ్ జలసంధి మార్గంలో నౌకల రవాణా నిలిపివేత సాగుతుందని, ఈ మార్గంలో ఏ నౌక రవాణా జరిగినా తమ దాడులకు గురి కావల్సిందే అన్నారు. ఇక గల్ఫ్‌లోని తమ మిత్రదేశాలు ఇకనైనా అక్కడి అమెరికా సైనిక స్థావరాలను మూసివేయాలి. అమెరికాతో మిత్రత్వం వదులుకోవాలి.
ఆయా దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు ఇకపై కూడా ఆగకుండా సాగుతాయని తెలిపారు. గల్ఫ్ దేశాలతో తమ స్నేహాన్ని గౌరవిస్తామని ,అయితే అక్కడి యుఎస్ స్థావరాలు తమ దాడులకు దెబ్బతినాల్సిందే అని హెచ్చరించారు. ట్రంప్ యుద్ధ విరమణ సంకేతాల ప్రకటన జోలికి వెళ్లకుండా ఇరాన్ కొత్త నేత , ఖమేనీ వారసుడు తీవ్రపదజాలంతో హెచ్చరికలు వెలువరించడం అంతర్జాతీయ యుద్ధ స్థితిని మరింతగా రగిలించినట్లు అయింది. మినాబ్ పాఠశాలపై దాడులు, అక్కడి చిన్నారుల వధ వంటి పలు అమానుష ఘటనలపై తమ ప్రతీకారం తప్పదని మొజ్తబా హెచ్చరించారు. ఏదో విధంగా తమ ఇరుగుపొరుగుదేశాలతో స్నేహ సంబందాలు పునరుద్ధరించుకోవాలని యత్నిస్తామని, అయితే ఈలోగా తమ సైనిక చర్యలు సాగుతూనే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. యుద్ధం ప్రారంభంలోనే మొజ్తాబా తీవ్రంగా గాయపడ్డారని , ఆయన నాయకత్వం కుదరకపోవచ్చునని ఇజ్రాయెల్ సంస్థలు అంచనావేశాయి. ఇప్పుడు ఆయన నుంచి తీవ్రస్థాయి ప్రకటన వెలువడింది. 56 సంవత్సరాల మొజ్తాబా టీవీలలో ప్రత్యక్షంగా కనబడలేదు. అయితే ఆయన ప్రకటనను అధికారికంగా చదివి విన్పించారు.
మూడు షరతులు అంగీకరిస్తే యుద్ధం ఆపేస్తాం: ఇరాన్
పశ్చిమాసియాలో యుద్ధం పరిసమాప్తం కావడానికి ఇరాన్ మూడు షరతులు విధించింది. ఈ షరతులు నెరవేరితేనా యుద్ధానికి ముగింపు పలుకుతామని ఎక్స్ వేదికగా ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ట్వీట్ చేశారు. ఈ షరతులపై అమెరికాఇజ్రాయెల్‌తో సంప్రదింపులు జరిపేందుకు రష్యాపాకిస్థాన్‌లు మధ్యవర్తిత్వం వహించాలని కోరారు. మొదటి షరతుగా ఇరాన్ హక్కులను అంతర్జాతీయంగా గుర్తించాలని టెహ్రాన్ డిమాండ్ చేసింది. తమ సార్వభౌమాధికారాన్ని అంగీకరించకపోతే శాంతి సాధ్యం కాదని స్పష్టం చేసింది. రెండవ షరతుగా ఇప్పటివరకు జరిగిన యుద్ధ దాడుల వల్ల కలిగిన నష్టాలకు అమెరికా, ఇజ్రాయెల్ పరిహారం చెల్లించాలని కోరింది.
మూడవ షరతుగా భవిష్యత్తులో ఇరాన్‌పై దాడులు జరగబోవని హామీ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మూడు షరతులకు అంగీకరించకుంటే యుద్ధం కొనసాగుతుందని హెచ్చరించింది. యుద్ధానికి ముందు అణు ఒప్పందంపై చర్చల సమయంలో ఇరాన్ అణుశక్తిని పెంపొందించుకోవడం తమ హక్కుగా వాదించింది. తమ దేశం అణుబాంబుల కోసం కాకుండా శాంతియుత ఇంధన అవసరాల కోసం యూరేనియం శుద్ధి చేసే హక్కును సమర్ధించుకుంది. ఈనెల 10న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్‌తో తక్షణం యుద్ధాన్ని ఆపాలని సూచించారు. చర్చల ద్వారానే రాజకీయ పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా పెజెష్కియన్ ఇరాన్‌కు మానవతాసాయం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇరాన్ హెచ్చరిక..
ఒక బ్యారెల్‌కు 200 డాలర్ల వంతున చెల్లించడానికి ప్రపంచం సిద్ధంగా ఉండాలని గురువారం ఇరాన్ హెచ్చరించింది. చమురు సంక్షోభాన్ని ఎదుర్కోడానికి వ్యూహాత్మక నిల్వలను విడుదల చేయాలని అంతర్జాతీయ ఇంధన సంస్థ సిఫారసు చేసిన నేపథ్యంలో తాజా హెచ్చరిక వచ్చింది. హర్మూజ్ జలసంధిలో అమెరికా మిత్రదేశాల నౌకలు ప్రవేశిస్తే పేలిపోయేలా ఇరాన్ సముద్రపు మందుపాతరలు అమర్చడం ఆందోళన కలిగిస్తోంది.