Reading Time: < 1 minute

వాణిజ్య, గృహ అవసరాల ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ల తీవ్ర కొరతపై కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి లేఖ రాశారు. ప్రస్తుతం ఎల్‌పిజి సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన తీవ్ర అంతరాయం వల్ల హోటళ్లు, తినుబండారాల కేంద్రాలు, పిజి హాస్టళ్లు, చిన్న చిన్న ఆహార వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని కెటిఆర్ తన లేఖలో పేర్కొన్నారు. వెంటనే సరఫరా పునరుద్ధరించకపోతే వేలాది వ్యాపార సంస్థలు మూతపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో లక్షలాది మంది కార్మికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కెటిఆర్ కేంద్ర ప్రభుత్వానికి పలు ఆచరణాత్మక సూచనలు చేశారు. ముఖ్యంగా చిన్న వ్యాపారులను రక్షించే విధంగా స్థాయిలవారీ ఎల్‌పిజి కేటాయింపు వ్యవస్థను ప్రవేశపెట్టాలని సూచించారు.అలాగే ఎల్‌పిజి సిలిండర్ల లభ్యతపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించేలా రియల్ టైమ్ పబ్లిక్ డాష్‌బోర్డ్ ఏర్పాటు చేయాలని కోరారు.

ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో వాణిజ్య సిలిండర్ల ధరలను పెంచకుండా తాత్కాలిక ధరల స్థిరీకరణ చేయాలని కేంద్రాన్ని అభ్యర్థించారు. అదనంగా గృహ సిలిండర్లను అక్రమంగా వాణిజ్య అవసరాలకు మళ్లిస్తూ జరుగుతున్న బ్లాక్ మార్కెటింగ్ అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఐటీ కారిడార్ ప్రాంతాల్లో నివసిస్తున్న లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు ఆధారపడే పిజి హాస్టళ్లకు ప్రత్యేక రక్షణ కేటగిరీ కింద గ్యాస్ సరఫరా చేయాలని సూచించారు. గ్యాస్ ఆధారిత శ్మశాన వాటికల్లో కార్యకలాపాలు నిలిచిపోకుండా ఉండేందుకు వాటిని అత్యవసర సేవలుగా గుర్తించి ప్రాధాన్య కేటాయింపు ఇవ్వాలని పేర్కొన్నారు. హోటల్, ఆహార రంగంపై ఆధారపడిన లక్షలాది మంది దినసరి కార్మికుల జీవనోపాధి ప్రమాదంలో పడకుండా కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం నెలకొన్న ఈ పరిస్థితి సాధారణ సమస్య కాదని, ఇది లక్షలాది మంది ప్రజల జీవనోపాధిని ప్రభావితం చేసే సంక్షోభమని అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే సమన్వయంతో చర్యలు చేపట్టి ఎల్‌పిజి సరఫరాను పునరుద్ధరించాలని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు.