
తెలంగాణ రైతులు పండించిన 1,25,855 మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలు, నూనెగింజలను రూ.894 కోట్లకు పైగా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) చెల్లించి కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రైతులకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, కేంద్ర వ్యయసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మార్కెట్లలో ధరల హెచ్చుతగ్గుల ప్రభావం రైతుల మీద పడకుండా వారికి నిరంతరం అండగా ఉంటూనే ఇప్పుడు పెద్ద ఎత్తున పప్పుధాన్యాలు, నూనెగింజల కొనుగోలుకు ఆమోదం తెలుపడం మోడీ ప్రభుత్వానికి తెలంగాణ రైతుల అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. 2026 పంట కాలానికి సంబంధించి రాష్ట్ర రైతులు పండించిన 29,860 మెట్రిక్ టన్నుల శనగలు, 37,020 మెట్రిక్ టన్నుల మినుములు, 55,285 మెట్రిక్ టన్నుల వేరుశనగ, 3,690 మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు విత్తనాలను
కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వం చేపడుతున్న ఇలాంటి సానుకూల చర్యల వల్ల తెలంగాణ రైతులకు తగిన ఆదాయం రావడంతోపాటుగా వాణిజ్య పంటలు పండించడానికి తగిన ప్రోత్సాహం కూడా లభిస్తుందని అన్నారు. అంతేకాకుండా, ఈ చర్యలు వ్యవసాయ రంగ అభివృద్ధికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఊతమిస్తాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లుగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో భూసార పరీక్షలు మొదలుకొని సబ్సిడీ విత్తనాలు, సబ్సిడీ ఎరువులు, సబ్సిడీ వ్యవసాయ పనిముట్లు వంటి అనేక ప్రయోజనాలను రైతులకు కల్పిస్తోందని పేర్కొన్నారు. దీంతోపాటుగా పంట ఉత్పత్తికి అయ్యే ఖర్చును తగ్గించడంతోపాటుగా, పండించేందుకు అయ్యే ఖర్చుకు కనీసం 50 శాతం నుంచి 100 శాతం అధికంగా కనీస మద్దతు ధరను అందిస్తూ రైతుల ఆదాయాన్ని పెంచేందుకు అనేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. 2014 నుంచి నేటి వరకు తెలంగాణ రైతులు పండించిన దాదాపు రూ.2 లక్షల కోట్ల విలువైన వరి ధాన్యాన్ని, రూ.70 వేల కోట్ల విలువైన పత్తిని కనీస మద్దతు ధర చెల్లించి కేంద్రం సేకరించిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు.