Reading Time: < 1 minute

టి-20 ప్రపంచకప్‌-2026ను టీం ఇండియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. టోర్నమెంట్ ఆద్యంతం అద్భుతంగా రాణించిన భారత్.. మూడోసారి ట్రోఫీని అందుకున్న జట్టుగా చరిత్ర సృష్టించింది. అయితే ఒక మ్యాచ్‌లో మాత్రం టీం ఇండియా విఫలమైంది. సూపర్-8 దశలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ సేన ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్‌ని బెంచ్‌కే పరిమితం చేయడంపై సర్వత్ర విమర్శలు వచ్చాయి. అయితే ఈ విషయంపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాజా స్పందించారు. అక్షర్‌ని పక్కన పెట్టినందుకు క్షమాపణ కోరినట్లు సూర్య తెలిపాడు.

‘దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు అక్షర్ పటేల్‌ను బెంచ్‌పైనే ఉంచాం. ఆ సమయంలో అక్షర్ చాలా ఆగ్రహంగా ఉన్నాడు. అనుభవం కలిగిన ప్లేయర్, ఓ ఫ్రాంచైజీకి కెప్టెన్సీ చేశాడు. ఇప్పుడు వైస్ కెప్టెన్‌గానూ ఉన్నాడు. కాబట్టి అతడి ఆగ్రహంలో తప్పు లేదనిపించింది. ఆ తర్వాత అతడికి క్షమాపణలు చెప్పా. పొరపాటు చేశాం.. క్షమించమని కోరా. అయితే, తుది జట్టు నిర్ణయం టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకుంది. అక్షర్ పటేల్ కూడా అర్థం చేసుకున్నాడు. మరుసటి రోజు నుంచి మేమంతా మామూలుగానే మాట్లాడుకున్నాము’’ అని సూర్య వివరించాడు.