Reading Time: < 1 minute

పార్టీ ఫిరాయింపుల కేసులో బిఆర్ఎస్ పార్టీకి నిరాశే మిగిలింది. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు వేటు వేస్తుందని భావించిన బిఆర్ఎస్ కు షాక్ తగిలింది. స్పీకర్ తీర్పుతో ఈ కేసులో విచారణను ముగిస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన పది మంది కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తూ తొలుత స్పీకర్.. తర్వాత సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

సుప్రీం ఆదేశాలతో విచారణ జరిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, టి. ప్రకాష్ గౌడ్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, కె. సంజయ్, దానం నాగేందర్, కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారన్న అభియోగాలతో దాఖలైన పిటిషన్లను స్పీకర్ తోసిపుచ్చారు. వారు పార్టీ మారినట్లు సరైన సాక్షాధారాలు చూపించనందున అనర్హత పిటిషన్లను కొట్టి వేస్తున్నట్లు ప్రకటించారు. గురువారం విచారణ సందర్భంగా బిఆర్ఎస్ పిటిషన్లను పరిష్కరించినట్లు స్పీకర్ న్యాయవాది సింఘ్వీ సుప్రీంకోర్టుకు తెలిపారు. దీంతో సింఘ్వీ వాదనతో ఏకీభవించిన జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం.. పార్టీ ఫిరాయింపుల కేసులో విచారణ ముసినట్లు ప్రకటించింది. రెండు రోజుల్లో స్పీకర్ తన తీర్పు కాపీలను ఫిర్యాదుదారులకు ఇవ్వాలని ఆదేశించింది.