Reading Time: < 1 minute

హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ పాలనలో ప్రతి పేద ముస్లింలకు రంజాన్ తోఫా ఇచ్చామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. షాది ముబారక్ తో పేద ముస్లిం అమ్మాయి పెళ్లికి లక్షానూటపదహారు ఇచ్చామని, మళ్లీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. రంజాన్ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ సలీం ఆధ్వర్యంలో రేషన్ కిట్ ల పంపిణీ చేశారు. పేద ముస్లిం మహిళలకు రంజాన్ రేషన్ కిట్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కెటిఆర్, దాసోజ్ శ్రవణ్, కర్నె ప్రభాకర్ పాల్గొన్న సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్ షాది ముబారక్ తో పాటు తులం బంగారం ఇస్తామన్నారు ఏమైంది? అని ప్రశ్నించారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్ని పథకాలకు స్వస్థి పలికిందని, సిఎం రేవంత్ రెడ్డి పేదల ఇండ్లపై బుల్డోజర్ ను పంపించడమే పనిగా పెట్టుకున్నారని, పథకాలు బంద్ చేసి పేదల ఇళ్లపై బల్డోజర్లు పంపిస్తున్నారని విమర్శించారు. 

గ్యాస్ కొరతతో వేలాది సంస్థలు మూతపడే ప్రమాదం ఉందని, లక్షలాది కార్మికులు, విద్యార్థులు ఇబ్బందులకు గురవుతారని, హోటళ్లు, చిన్నవ్యాపారులు, హాస్టళ్లు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. కేంద్రమంత్రి హర్దిప్ సింగ్ పూరీకి కెటిఆర్ లేఖ రాశారు. ఎల్పిజి లభ్యతపై రియల్ టైమ్ డాష్ బోర్డును ఏర్పాటు చేయాలని, వాణిజ్య సిలిండర్లపై తాత్కాలికంగా ధరల పెంపు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సిలిండర్ల అక్రమ రవాణా అరికట్టాలని, బ్లాక్ మార్కెట్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పిజి హాస్టళ్లు, స్మశాన వాటికలు, చిన్న వ్యాపారులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, అత్యవసర సేవలు, జీవనోపాధిని కాపాడేందుకు చర్యలు చేపట్టాలని కెటిఆర్ కోరారు.