
పూణే: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా చిక్కుల్లో పడ్డాడు. పాండ్యా, జాతీయ జెండాను అవమానించాడంటూ ఓ న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2026 టీ20 ప్రపంచ కప్ సాధించిన భారత జట్టు.. విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో జాతీయ జెండాను అగౌరవపరిచారని పూణేకు చెందిన న్యాయవాది ఆరోపించాడు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో భారత్ న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి మూడోసారి కప్ ను సొంతం చేసుకుంది. ఈ ఆనంద సమయంలో జట్టు సభ్యులు మైదానంలో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో పాండ్యా, భారత జెండాను చుట్టూ కప్పుకుని తన స్నేహితురాలు మహికా శర్మతో కలిసి మైదానంలో వేడుకలు చేసుకోవడాన్ని సదరు న్యాయవాది తప్పుబట్టాడు. జాతీయ జెండాను ధరించి క్రికెటర్ పాండ్యా, మహికాతో పడుకున్నారని.. ఇది జాతీయ జెండాన్ని అగౌరవపర్చడమేనని మండిపడ్డాడు. ఈ సంఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అతను పోలీసులను ఫిర్యాదు చేశాడు.