
అమరావతి: నీటిని సక్రమంగా ఉపయోగించుకుంటేనే ప్రయోజనం ఉంటుందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. భవిష్యత్తు తరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. సిఎం అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. పెట్టుబడులు, వైద్యం,సూపర్ సిక్స్- సంక్షేమంపై, ఆదాయార్జన శాఖలు, విద్య- నైపుణ్యాభివృద్ధి అంశాలపై చర్చ జరిగింది. మధ్యాహ్నం నుంచి శాంతిభద్రతల అంశంపై సమీక్షించనున్నారు. పారిశ్రామిక హబ్ గా మార్చేందుకు అన్ని రకాల చర్యలు, జిల్లాల వారీగా పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలను వివరించారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంపద సృష్టించేందుకు ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఎలా ఉందో జిల్లాల వారీగా వివరాలు ఉండాలని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై కలెక్టర్లు దృష్టి సారించాలని చంద్రబాబు ఆదేశించారు. గత వైసిపి ప్రభుత్వంలో పెట్టుబడులకు ఎవరూ ముందుకు రాలేదని, ఉన్న కంపెనీలు కూడా పారిపోయిన పరిస్థితిని అందరం చూశామని తెలియజేశారు. వనరులు ఉన్నా సరైన రీతిలో ఉపయోగించుకోవాలని, ఉన్న వనరులను సక్రమంగా ఉపయోగించుకోకపోతే వ్యర్థమేనని అన్నారు. అభివృద్ధికి సంకల్పించినప్పుడు చిన్నదే కావచ్చు.. దీర్ఘకాలంలో వాటి ఫలితాలు చూస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.