
హైదరాబాద్: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించనుంది. 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో ఈ కేసులో సుప్రీం కోర్టు గురువారం తుది తీర్పు ఇవ్వనుంది. ఈ క్రమంలో అటు బిఆర్ఎస్ లోనూ, ఇటు పిరాయింపు ఎమ్మెల్యేల్లోనూ ఉత్కంఠ నెలకొంది.
తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన పది మంది కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తూ తొలుత స్పీకర్.. తర్వాత సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సుప్రీం ఆదేశాలతో విచారణ జరిపిన స్పీకర్ ప్రసాద్ కుమార్.. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, టి. ప్రకాష్ గౌడ్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, కె. సంజయ్, దానం నాగేందర్, కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారన్న అభియోగాలతో దాఖలైన పిటిషన్లను స్పీకర్ తోసిపుచ్చారు. వారు పార్టీ మారినట్లు సరైన సాక్షాధారాలు చూపించనందున అనర్హత పిటిషన్లను కొట్టి వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో పది మంది ఎమ్మెల్యేలకు ఊరట లభించింది.