
ప్రపంచ పరిణామాలు ఎంతదూరంలో జరిగినా, వాటి ప్రభావం సామాన్య వ్యక్తి జీవితంపైనే పడుతుంది. ముఖ్యంగా వ్యవసాయం వంటి సున్నితమైన రంగంపై అంతర్జాతీయ సంఘర్షణల ప్రభావం చాలా తీవ్రం. ప్రస్తుతం పశ్చిమాసియాలో విస్తరిస్తున్న యుద్ధ ఉద్రిక్తతలు, ఆర్థిక ఆంక్షలు, సరఫరా గొలుసుల్లో వచ్చిన అంతరాయాలు భారతీయ వ్యవసాయరంగాన్ని గణనీయంగా ప్రభావితం చేసే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఎరువుల ధరల పెరుగుదల, రవాణా వ్యయాలు, ఎగుమతి మార్కెట్లలో అస్థిరత.. ఇవన్నీ అన్నదాతలపై అదనపు భారంగా మారుతున్నాయి. ఇది కేవలం ఆర్థిక సమస్య కాదు; ఇది భారతదేశ ఆహార భద్రతకు, రైతు ఆత్మగౌరవానికి సంబంధించిన జాతీయ సవాలు. వ్యవసాయంలో ఎరువులు అనేవి రక్తం లాంటివి. ప్రపంచవ్యాప్తంగా యూరియా, ఫాస్ఫేట్, పొటాష్ తయారీ సహజ వాయువుపై ఆధారపడి ఉంది. పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రమైతే సహజ వాయువు సరఫరా దెబ్బతినడం ఖాయం. దీని ప్రభావం నేరుగా ఎరువుల ఉత్పత్తి వ్యయంపైపడి, మార్కెట్ ధరలు ఆకాశాన్నంటాయి. ఇప్పటికే గత కొన్నేళ్లుగా ఎరువుల ధరలు రైతులను కష్టాల్లో ముంచేశాయి.
ఇప్పుడు యుద్ధం కలిసి వచ్చేస్తే వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటల సాగు ఖర్చు మరింత ఎగిసి, రైతు లాభాలు మట్టిలో కలిసిపోతాయి. సాగు వ్యయం పెరిగినా, మార్కెట్ ధరలు అదే స్థాయిలో పెరగకపోతే రైతు ఆర్థిక దశ మరింత దారుణంగా మారడం తప్పదు. ఇది కేవలం ఎరువులతో ఆగదు. పశ్చిమాసియా ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన సముద్ర మార్గాలు.. హార్ముజ్ జలసంధి, ఎర్ర సముద్రం.. ఉద్రిక్తతలతో కలకలమైతే నౌకాశ్రయ రవాణా, బీమా ఖర్చులు భారీగా పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి బియ్యం, మిర్చి, రొయ్యలు పెద్ద ఎత్తున పశ్చిమాసియా దేశాలకు వెళ్తున్నాయి. ఇరాన్ లాంటి దేశాలు మన బియ్యం ముఖ్యమైన కొనుగోలుదారులు. యుద్ధం వల్ల ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు బలహీనపడితే లేదా రవాణా మార్గాలు మూసుకుపోతే మన ఎగుమతులు నేలకూలతాయి. ఇది కేవలం వ్యాపార నష్టం కాదు; లక్షలాది రైతుల, మత్స్యకారుల జీవనోపాధి ప్రశ్నార్థకం అవుతుంది. మరో వైపు, వ్యవసాయం పూర్తిగా ఇంధనంపై ఆధారపడి ఉంది. ట్రాక్టర్లు, నీటి మోటార్లు, రవాణా వాహనాలు అన్నీ డీజిల్‌పై నడుస్తాయి.
పశ్చిమాసియా యుద్ధం చమురు ధరలను ఎగరేస్తే భారత్‌లో డీజిల్ ధరలు పెరగడం ఖాయం. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, కార్మిక ఖర్చులు పెరిగిన తర్వాత ఇంధన ధరలు కూడా ఎగిస్తే రైతు తీవ్ర ఆర్థిక ఒత్తిడికి లోనవుతాడు. ఎరువుల కొరత వల్ల రైతులు తక్కువ ఎరువులు వాడితే పంటల దిగుబడులు తగ్గి, దేశీయ ఆహార ఉత్పత్తి తగ్గి, ఆహార భద్రతకు గండి పడే ప్రమాదం ఉంది. భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారు. దిగుబడులు తగ్గితే దేశీయ అవసరాలు తీర్చడమే సవాలుగా మారి, ఆహార ధరలు పెరిగి సాధారణ ప్రజలు కూడా ఇబ్బందిపడతారు. అయితే ప్రతి సంక్షోభంలో ఒక అవకాశం దాగి ఉంటుంది. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నప్పుడు కొన్ని దేశాలు ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతుక్కుంటాయి. అప్పుడు మన బియ్యం, మసాలా పంటలు, పప్పుధాన్యాలకు మంచి డిమాండ్, మంచి ధరలు లభించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రపంచ రొయ్యల ఉత్పత్తిలో కీలకం. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటే ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి.
ప్రభుత్వాలు ఏం చేయాలి? ‘ఎరువుల సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు ప్రత్యామ్నాయ దిగుమతి మార్గాలను వెంటనే అన్వేషించాలి.
‘రైతులకు డీజిల్, ఎరువులపై సబ్సిడీలను పెంచాలి.’ ఎగుమతులకు కొత్త మార్కెట్లను అభివృద్ధి చేయాలి. ‘నిల్వ వ్యవస్థలను బలోపేతం చేసి, సంక్షోభ సమయంలో కూడా ఆహార భద్రత కాపాడాలి. పశ్చిమాసియా యుద్ధం కేవలం రాజకీయ లేదా భౌగోళిక సమస్య కాదు. అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే శక్తివంతమైన ఆయుధం. ఆ దెబ్బ చివరికి భారతీయ రైతు పొలానికి, అతని కుటుంబానికి చేరుతుంది. కాబట్టి ఈ సంక్షోభాన్ని తాత్కాలిక సమస్యగా కాకుండా, దీర్ఘకాలిక వ్యూహంతో ఎదుర్కోవాలి. రైతులకు రక్షణ, వ్యవసాయానికి బలం, ఆహార భద్రతకు కాపలా.. ఇవే ప్రభుత్వాల ముందున్న అత్యవసర బాధ్యతలు.
మేకల కృష్ణ
99485 56978